భారత రాష్ట్ర సమితి పరాజయం ఆ పార్టీ భవిష్యత్ పై ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి క్యాడర్, లీడర్ అంతా ఇతర పార్టీలకు చెందిన వారే. తెలంగాణ వాదం పేరుతో ఇంత కాలం బండి నడిపించారు కానీ ఇక ముందు సాధ్యం కాదని… ఎన్నికల్లో పరాజయంతోనే తేలిపోయింది. అందరూ ఆకర్ష్ ద్వారా వచ్చిన నేతలే కావడంతో వారిని నిలబెట్టుకోవడం పెద్ద సవాల్. అభివృద్ధి కోసం అంటూ… వేరే పార్టీల్లో చేరినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.
ఇతర పార్టీల్ని గతంలో విలీనం చేసుకున్న కేసీఆర్
ప్రతిపక్షాల లెజిస్లేచర్ పార్టీలను విలీనం చేసుకోవడంలో కేసీఆర్ ది ఓ ప్రత్యేక శైలి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాజకీయ ఏకీకరణ కావాలంటూ… టీడీపీ, కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులను కూడా వదలకుండా ఎల్పీలను విలీనం చేసుకున్నారు. స్పీకర్ తో గెజిట్ కూడా విడుదల చేయించారు. పార్టీలు విలీనమైపోయాయన్నంతగా ప్రచారం చేశారు. అప్పట్లో ప్రజలు సమర్థించారు. 2018లో ఆ ఫిరాయింపు దార్లు మళ్లీ గెలిచారు. కానీ ఎలాంటి అవసరం లేకపోయినా మళ్లీ 2018లో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు. అప్పట్లోనే ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ కు వస్తుందని .. అప్పుడు సమర్థించుకోలేరని మండిపడ్డారు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. ఇప్పుడు కళ్ల ముందుకు వచ్చేస్తోంది.
రిజల్ట్ వచ్చిన గంటలోనే అభివృద్ధి కోసం ఓ ఎమ్మల్యే రూటు మార్పు
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ ఏం చేశారో ఇప్పుడు బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయడానికి అంత కంటే ఎక్కువే చేస్తారు. అందులో సందేహం లేదు. జాతీయ పార్టీలన్నీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎక్కువ ప్రయత్నిస్తున్నాయి. ఫలితాలు వచ్చిన గంటల్లోనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. గ్రేటర్ పరిధిలో మెజార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమైనా కాంగ్రెస్ వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ ఇతర ఎమ్మెల్యేల్ని తమ పార్టీలో చేర్చుకోవడానికి ఏం చేశారో కేసీఆర్ అదే చేస్తారు. అలా జరిగినా ప్రజల నుంచి బీఆర్ఎస్ కు .. కేసీఆర్ కు సానుభూతి రాదు. ఎందుకంటే…ఆయన చేసిన పనే కదా అది.
బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తారా ?
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే మార్చి ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయి. అక్కడ తేడా వస్తే ఆ తర్వాత పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. అందుకే కేసీఆర్ బీజేపీతో పొత్తుల గురించి ఆలోచించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేసీఆర్ ముందు పార్టీని కాపాడుకోవాలి. అందు కోసం ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.