తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజార్టీ సాధించింది. కానీ కాస్త తరచి చూస్తే.. భారతీయ జనతా పార్టీ అతి కీలక పాత్ర పోషించే దిశగా బలోపేతం అవుతోందని అర్థమైపోతుంది. ఎనిమిది సీట్లలో విజయం సాధించడమే కాదు. మరో పద్దెనిమిది సీట్లలో అతి స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. పధ్నాలుగు శాతం ఓట్లు తెచ్చుకుంది. అగ్రనేతలు స్వల్ప తేడాతో పరాజయం పాలై ఉండవచ్చు కానీ వారి స్ఫూర్తి మాత్రం… తెలంగాణ బీజేపీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీతోనే పోటీ పడాలి…!
ఆదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ కీలక శక్తిగా ఎదిగింది. బీఆర్ఎస్ అయినా.. కాంగ్రెస్ అయినా బీజేపీతోనే తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు జిల్లాల్లో ఏడు చోట్ల బీజేపీ విజయం సాధించింది. మరో ఆరు చోట్ల రెండో స్థానంలో నిలిచింది. ఖచ్చితంగా గెలుస్తారని భావించిన కోరుట్ల, కరీంనగర్ వంటి స్థానాలు కోల్పోవడంతో కౌంట్ తగ్గింది. కానీ… బీజేపీ ఇచ్చిన పోటీ చేసి.. ముందు రోజులలో ఆ పార్టీని నిలువరించడం కష్టమన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి..ఇక బీజేపీ .. ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహిరంచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఇప్పటికే కాంగ్రెస్ ఆకర్ష్ ప్రయోగిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
గ్రేటర్ పరిధిలో మరింత బలం పెరిగితే బీజేపీ హవా
గ్రేటర్ పరిధిలో ఈ సారి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ లాభం పొందింది. దానికి కారణమమేమిటో కానీ.. భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. గోషామహల్ సీటును నిలబెట్టుకోవడంతో పాటు పాతబస్తీలో కొన్ని సీట్లలో సగం రౌండ్ల వరకూ ఆధిపత్యం ప్రదర్శించింది. వచ్చే ఎన్నికల నాటికి పాతబస్తీలో మరో నియోజకవర్గంలో బీజేపీ జెండా పాతే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నాటికి మరింతగా బలం పుంజుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్ాయి. ఇక నుంచి బీజేపీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.
క్రమంగా పెరిగితేనే బలమైన పార్టీ నిర్మాణం
గతంలో బీజేపీకి హైప్ వచ్చింది. కానీ గాలికి వచ్చిన హైప్ అంత ఎక్కువ కాలం నిలబడదు. రాజకీయాల్లో క్రమంగా బలపడుతూ వస్తేనే ప్రయోజనం ఉంటుంది. అందుకే ఈ సారి బీజేపీని క్రమంగా బలపరిచే ప్రయత్నాలను టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చేపట్టే అవకాశం ఉంది. ఎలా చూసినా.. తెలంగాణ ఫలితాలు తెలంగాణ బీజేపీకి మంచి బూస్ట్ ఇచ్చాయని అనుకోవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల చాయిస్ గా బీజేపీ ఉంటుందని గట్టి నమ్మకానికి బీజేపీ నాయకులు వచ్చారు.