తృణమూల్ కాంగ్రెస్ లో ఇంటిపోరు…

అదో ప్రాంతీయ పార్టీ. ప్రధాని కావాలన్న ఆకాంక్షతో మూడోసారి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ నిర్వహించే పార్టీ. ఆ పార్టీ నేతలు నిత్యం కీచులాడుకుంటూనే ఉంటారు. గ్రూపు తగాదాలకు ఆ పార్టీ పెట్టింది పేరు. సీనియర్లు వర్సెస్ జూనియర్లు అన్నట్లుగా ఇప్పుడా ఫైట్ తారా స్థాయికి చేరింది. మమత మేనల్లుడైన యువ నాయకుడు అభిషేక్ బెనర్జీ వర్గం కూడా ఇందుకు కారణంగా చెప్పాలి…

సౌగతా రాయ్ వర్సెస్ కునాల్ ఘోష్…

మూడు సార్లు ఎంపీగా చేసిన సౌగతా రాయ్ నిత్యం ఏదోక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడు మరో తృణమూల్ నేత కునాల్ ఘోష్ తో ఆయన వయసు వివాదానికి దిగారు. సీనియర్లు చచ్చిన దాకా పదవులు అనుభవిస్తారా.. అని కునాల్ ఘోష్ ఎక్కడో చేసిన వ్యాఖ్యలను సౌగతా రాయ్ బయటకు తీసి గందరగోళం సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీలో సీనియర్లు చేయాల్సిన పనులు, యువ నాయకత్వం తీసుకోవాల్సిన బాధ్యతలను అధినాయకురాలు మమతా బెనర్జీ నిర్ణయిస్తారని ఆయన ప్రకటించారు. దీనికి కునాల్ ఘోష్ తరగతులు నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన తేల్చారు…

అభిషేక్ వర్గం ఆగ్రహం..

తృణమూల్ లో రెండు గ్రూపులున్నాయి. సీనియర్లు మమతా బెనర్జీ గ్రూపుగా కొనసాగుతున్నారు.యువత, కొత్త వాళ్లంతా అభిషేక్ బెనర్జీ చుట్టూ చేరి పార్టీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. మమత తర్వాత నేనే అన్నట్లుగా ప్రవర్తించే అభిషేక్..తనవర్గాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఎవరేమి మాట్లాడినా మౌనంగా ఉండిపోతున్నారు. ఇప్పుడు అదే అంశాన్ని సౌగతా రాయ్ ప్రస్తావిస్తున్నారు. అభిషేక్ బెనర్జీ, కునాల్ ఘోష్ తమకు నాయకులు కాదని, తాము ఎప్పుడు, ఎక్కడ పోటీ చేయాలో మమతా బెనర్జీ నిర్ణయిస్తారని ఆయన ప్రకటిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు 75 సంవత్సరాల గరిష్ట పరిమితి బీజేపీలో ఉందని, అది తృణమూల్ కు వర్తించదని ఆయన చెబుతున్నారు.

మేనల్లుడిపై పార్టీ నేతల కారాలు మిరియాలు

అభిషేక్ బెనర్జీ దూకుడు తృణమూల్ సీనియర్లకు అసలు నచ్చలేదు. ఇటీవల కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన పార్టీ సదస్సులో స్టేజీ మీద అభిషేక్ ఫోటో లేకుండా వాళ్లు చూసుకున్నారు. అదేమని అడిగితే తాము మమతా బెనర్జీ నాయకత్వంలో పనిచేస్తున్నామని, అభిషేక్ కూడా తమలో ఒకరని సమాధానమిచ్చారు. నిజానికి రెండు సంవత్సరాల క్రితం ఇలాంటి వివాదమే చెలరేగింది. అప్పుడు తీవ్ర ఆగ్రహానికి లోనైన మమత పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేశారు.అప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీ కూడా పదవిని కోల్పోయారు. తర్వాత కొంతకాలానికి కమిటీలను వేసినప్పుడు అభిషేక్ కు మళ్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఇప్పుడు సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ వయసు వివాదం చెలరేగిన నేపథ్యంలో మమత ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే పరిపాలనా పరంగానే ఆమెకు చాలా తలనొప్పులు ఎదురవుతున్నాయి. పైగా కేసులంటూ కేంద్ర సంస్థలు కమ్ముకొస్తున్నాయి…