కాంగ్రెస్‌కు ఫిరాయింపుల టెన్షన్ – ప్యారాచూట్ లీడర్స్ రెడీ అవుతున్నారా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ మార్క్‌ 60సీట్లకు మించి గెలిచి అధికారంలోకి వస్తామని నమ్ముతున్న కాంగ్రెస్‌ పార్టీని బీఆరెస్‌ పార్టీ భయపెడుతున్నది. తమకు మెజార్టీ సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడంతో సంతోషంతో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఫిరాయింపుల గుబులు కలవర పెడుతున్నది. బీఆరెస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ తనకు అలవాటైన ఫిరాయింపుల గేమ్‌ ప్లాన్‌తో ఎక్కడ తమ ఎమ్మెల్యేలను ఎత్తుకెళుతారోనన్న ఆందోళన కాంగ్రెస్‌ శిబిరాన్ని టెన్షన్‌ పెడుతున్నది.

పారాచూట్ లీడర్స్ సర్దుకుంటున్నారా ?

2014లో, 2018లో గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ బీఆరెస్‌లోకి రప్పించుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో తమవారు ఉన్నారని, గెలిస్తే వారు బీఆరెస్‌లోకి వస్తారని ఎన్నికల్లో జరిగిన ప్రచారం సైతం కాంగ్రెస్‌ వర్గాల్లో గుబులు రేపుతున్నది. పైకి గతంలో మాదిరిగా ఈ సారి సీఎం కేసీఆర్‌ కాం గ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేరని పీసీసీ చీప్‌ రేవంత్‌ రెడ్డి గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోన ముందస్తు జాగ్రత్తగా క్యాంపు రాజకీయాల ప్రయత్నాల్లో మునిగారని అంటున్నారు. ఎందుకంటే గెలుపు గుర్రాల పేరుతో రేవంత్ పారాచూట్ లీడర్లకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు.

హైదరాబాద్ కు శివకుమార్ ను పంపుతున్న సోనియా

గెలిచే అవకాశమున్న కాంగ్రెస్‌ అభ్యర్థులను ముందుగానే క్యాంపుకు తరలించే ప్రయత్నం చేస్తునే, ఫలితాలు వెల్లడైన మరుక్షణమే గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలందరినీ క్యాంపుకు తరలించాలనే సన్నాహాల్లో కాంగ్రెస్‌ ఉన్నదని చెబుతున్నారు. ఇందుకోసం ట్రబుల్‌ షూటర్‌గా పేరోందిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ బ్రదర్స్‌ను రంగంలోకి దించారు. ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలను జార విడుచుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ నేతలు అనుకుంటున్నారు.

ప్రభుత్వం తమదేనంటున్న బీఆర్ఎస్

ఎగ్జిట్‌ పోల్స్‌ బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఉన్నా మెజార్టీ మార్కు సాధిస్తామని ధీమాతో ఉన్న బీఆరెస్‌ అధిష్ఠానం.. అనుహ్యంగా హంగ్‌ వస్తే అధికార సాధనకు అనుసరించాల్సిన ఎత్తుగడలపై కసరత్తులో నిమగ్నమైంది. శుక్రవారం సీఎం కేసీఆర్‌ డైరక్షన్‌లో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు పోలింగ్‌ సరళీ, ఎగ్జిట్‌ పోల్స్‌ ను సమీక్షించి నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటముల సమాచారాన్ని సేకరించి గెలిచే స్థానాలపై విశ్లేషణ చేశారని తెలిసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్కలకు భిన్నంగా బీఆరెస్‌ మెజార్టీ సీట్లు సాధించి మూడోసారి అకారంలోకి వస్తుందని వారు బయటకు చెబుతున్నారు. అయితే ఫలితాల్లో బీఆరెస్‌కు మెజార్టీకి సీట్లు తగ్గినా, హంగ్‌ వచ్చినా ఎంఐఎం గెలిచే సీట్లతో పాటు బీజేపీ మద్ధతు సాధన, కాంగ్రెస్‌ నుంచి వచ్చే ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టక తప్పదు. అదే జరిగితే మరోసారి కాంగ్రెస్‌ నుంచి ఫిరాయింపులను ప్రొత్సహించక తప్పదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.