ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి నాలుగు సీట్లు – కమలం కంచుకోట అయిందా ?

తెలంగాణలో అన్ని జిల్లాల కన్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలంగా మారిందని రిపోర్టులు వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మొత్తం పది అెసంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అన్నింటిలోనూ బీజేపీతో కొన్ని చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల కాంగ్రెస్ పోటీ పడ్డాయి. చివరికి నాలుగు స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది.

ముధోల్ బీజేపీదే !

తెలంగాణ కీలక నేత బండి సంజయ్ ఓ సందర్భంలో పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ముథోల్ నియోజకవర్గంలో బీజేపీ తరపున నిలబడిన రామారావు పటేల్ విజయం ఖాయమని తేలిపోయింది. ముధోల్ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, బీజేపీ నుండి రామారావు పటేల్, కాంగ్రెస్ నుండి నారాయణరావు పటేల్ పోటీలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోరు కొనసాగింది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మూడో స్థానంలో అధికార పార్టీ విట్టల్ రెడ్డి ఉండే అవకాశాలు ఉన్నాయని స్థానికంగా చర్చ కొనసాగుతోంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో ఉంది. ఈ సారి బీజేపీ విజయాన్ని వదిలే అవకాశాలు కనిపించడం లేదు.

నిర్మల్ లో మహేశ్వర్ రెడ్డికి భారీ మెజార్టీ ఖాయం

నిర్మల్ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓడిపోవడం ఖాయమయింది. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి దూకుడుగా రాజకీయం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున కూచిపూడి శ్రీహరి రావు పోటీలో ఉన్నారు. పోలింగ్ సరళిని చూస్తే, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని వెల్లడయింది. బీజేపీ అభ్యర్థి మహేశ్వర రెడ్డి గెలిచే అవకాశాన్ని స్థానికంగా చర్చ కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్తుందని చెబుతున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి కారణంగా.. ప్రజల కోసం మహేశ్వర్ రెడ్డి చేసిన పోరాటం ఆయనను గెలిపించబోతోందని చెబుతున్నారు.

ఖానాపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ – బీజేపీకి అడ్వాంటేజ్

అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ స్థానంలో జాన్సన్ నాయక్ కు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ నుండి వెడమ బొజ్జు, బీజేపీ నుండి రాథోడ్ రమేష్ పోటీలో నిలిచారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో పోరు కొనసాగింది. బీఆర్ఎస్ అభ్యర్థి అసలు గిరిజనుడు కాదన్న వివాదం ఏర్పడటంతో ఆయన మొదట్లోనే తేలిపోయారు. ఇక మాజీ మంత్రి రాథోడ్ రమేష్ కు నియోజకవర్గ వ్యాప్తంగా పట్టు ఉంది. ఆయన బీజేపీని బలోపేతం చేశారు. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్టిట్ పోల్స్ తేల్చాయి.

భోధ్‌లో గెలవనున్న ఎంపీ బాపూరావు

బోథ్ నియోజవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రాథోడ్ బాబురావు, కాంగ్రెస్ పార్టీ నుండి సోయం బాబురావు పోటాపోటీ పోరులో, 2023 మెజార్టీతో అధికార పార్టీ నాయకుడు రాథోడ్ బాబురావు గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చి అతని స్థానంలో గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అనిల్ జాదవ్ కు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆడే గజేందర్ పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా అధికార బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థి సోయం బాబురావు మధ్య పోటాపోటీ ఉంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేల్లో తేలింది. పోలింగ్ సందర్భంగా ఓటర్లు ఎక్కువ మంది ఎంపీ బాపూరావు వైపు మొగ్గినట్లుగా తేలింది. దీంతో ఈ నాలుగు స్థానాల్లో ఆదిలాబాద్ లో బీజేపీ విజయం ఖాయమయిందని అంచనా వేస్తున్నారు.