పదవి లేకపోతే రాజకీయ నాయకుడు బతకలేడట.అది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదవి అయినా దేశ ప్రధాని అయినా సరే అదే రూల్ వర్తిస్తుంది. రాజకీయాల్లోకి వచ్చిందే తడవుగా నేతలు పదవుల కోసం వెంపర్లాడటం సర్వసాధారణమైన విషయం. కాంగ్రెస్ పార్టీలో అయితే ఆత్రుత చాలా ఎక్కువగా ఉంటుంది.
రేవంత్ ఆచి తూచి అడుగులు…
తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. పార్టీకి 52 స్థానాలు వస్తాయని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ నిర్ధారించింది. అంతే అసలు ఫలితాలు రాకముందే కాంగ్రెస్ పార్టీలో సీఎం రేసు మొదలైంది. ఇప్పటికే డిసెంబరు 9న ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించిన రేవంత్ తర్వాత ఆలోచించుకుని కొంచెం స్లో అయ్యారు. ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేసే క్రమంలో ఎన్నికల వరకే తాను కేప్టెన్ అని, ఫలితాల తర్వాత ఎవరు కెప్టేనో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి వర్గీయులు మాత్రం ఆయన సీఎం అవుతారని ఎవరూ పోటీకి దిగాల్సిన అవసరం లేదని ప్రకటించేస్తున్నారు.
భట్టీ మీటింగులు, జగ్గా రెడ్డి ప్రకటనలు..
రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం నిన్న ఉదయం నుంచి యాక్టివ్ అయ్యింది. తాజా మాజీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొందరు సీనియర్లతో మీటింగులు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించే భట్టి విక్రమార్క…ఇటీవలి కాలంలో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విజయాకాశాలున్న అభ్యర్థులతో భట్టి వర్గం టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్టానం వద్దకు కూడా వెళ్లేందుకు వారిలో కొందరు ప్రయత్నిస్తున్నారు.ఫలితాలు వెలువడే 3వ తేదీ సాయంత్రం వాళ్లు ఢిల్లీలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. మరో పక్క సంగారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఎన్నికల పర్యటన సందర్భంగా తనను బబ్బర్ షేర్ అని సంబోదించడంతో జగ్గన్న ఉబ్బి తబ్బిబవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తానే సీఎం అవుతానని జగ్గారెడ్డి బహిరంగంగా చెప్పుకుంటున్నారు. సీఎం పదవిని ఆశిస్తున్న మరో ఇద్దరు నేతలున్నారు. అందులో ఒకరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లొండ స్థానం నుంచి వెంకట్ రెడ్డి గెలుస్తారని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో సీఎం పదవిపై ఆశలు పెట్టుకుని.. అభ్యర్థులందరికీ ఆయన ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం.. ఉత్తమ కుమార్ రెడ్డికి ఆశలున్నా..ప్రస్తుతానికి ఆయన గుంభనంగా ఉన్నారు…
ఛత్తీస్ గఢ్ నేత సింగ్ దేవ్ ఆరాటం…
కాంగ్రెస్ మళ్లీ గెలిచే అవకాశం ఉన్న ఛత్తీస్ గఢ్ లో కౌన్ బనేగా సీఎం అన్న చర్చ మొదలైంది.ప్రస్తుత సీఎం భూపేష్ భాగెల్ కు మళ్లీ అవకాశం వస్తుందని పార్టీ వర్గాలు చెబుతుండగా, తానేమీ తక్కువ చేశారని డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ ప్రశ్నిస్తున్నారు. సీఎం అభ్యర్థి ఎవరో అధిష్టానం నిర్ణయిస్తుందని అంటూనే తన మద్దతుదారులను కూడగట్టే పనిలో ఉన్నారు.పార్టీలో అందరం ఐకమత్యంగా ఉన్నామని చెప్పుకునే సింగ్ దేవ్ పెద్ద గ్రూపుకు నాయకుడు. అందుకే ఇష్టం లేకపోయనా కాంగ్రెస్ అధిష్టానం సింగ్ దేవ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. సీఎం పదవి కోసం ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టారని సింగ్ దేవ్ పై ఆరోపణలున్నాయి.