బీజేపీ వ్యూహం – అసెంబ్లీ ఎన్నికల్లోనే 2024 ప్రచారం

రాజకీయ పార్టీలంటేనే వర్తమానంతో పాటు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ అడుగులోనూ రేపేమిటి అనే ప్రశ్న, దానిలోనే సమాధానం వెదుక్కునే తత్వం కనిపిస్తుంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే తీరుతో ముందుకు నడుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ముమ్మర ప్రచారం చేసింది. పనిలో పనిగా 2024 లోక్ సభ ఎన్నికలకు పనికొచ్చే అంశాలనే ఎక్కువగా ప్రచార టూల్స్ గా వాడింది.

మోదీ మాత్రమే పార్టీ లీడర్..

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. తెలంగాణ పోలింగ్ ఈ నెల 30న నిర్వహిస్తారు. అన్ని చోట్ల భారీ స్థాయిలోనే ప్రచారం జరిగింది. ఐదు రాష్ట్రాలకు కలిపి వందకు పైగా సభల్లో మోదీ మాట్లాడారు. ఆయన రోడ్ షోలకు విశేష స్పందన లభించింది. ఎన్నికల పర్యటనకు మోదీ వస్తున్నారంటే అదో పండుగ వాతావరణం కనిపించింది. సర్వం మోదీ అన్న ఫీలింగ్ సృష్టించడంతో బీజేపీ సక్సెస్ అయ్యింది. ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించలేదు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినా ఎవరి పేరు తెరపైకి రాలేదు. బీసీ నేతల్లో ఎవరికి వారే ముఖ్యమంత్రి అభ్యర్థినని చెప్పుకుంటున్నారు. వీటన్నింటి నడుమ మోదీ మొహం చూసి ఓటెయ్యమన్నట్లుగానే ప్రచారం చేశారు. పైగా కమలం గుర్తు మాత్రమే ముఖ్యమని ఇంకేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఒక వర్గం ప్రచారం చేసిన మాట వాస్తవం.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన ప్రచారాస్త్రాలు

బీజేపీ ఆలోచన చాలా క్లియర్ గానే ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలవాలన్నదే ఆ పార్టీ ధ్యేయం. కొన్ని అసెంబ్లీలు ఎలాగూ కైవశం చేసుకుంటామన్న నమ్మకం ఆ పార్టీ నేతలకు ఉంది.లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు వీలుగా జాతీయ ప్రధానాంశాలను పార్టీ ప్రస్తావించింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం రెడ్ డైరీ వ్యవహారాన్ని మోదీ స్వయంగా గుర్తు చేశారు. గెహ్లాట్ ప్రభుత్వ అవినీతిపరుల చిట్టా ఆ రెడ్ డైరీలో ఉందని అంటూ అసలు రాష్ట్రంలోనూ, దేశంలోనూ ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని చెప్పుకొచ్చారు. ఆరు దశాబ్దాల పాటు దేశంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి, దుష్పరిపాలన కారణంగా నిరుద్యోగం పెరిగిపోయిందని, ధరలను నియంత్రించలేని పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం చుక్కలనంటిందని ఆయన ఆరోపించారు. గత పదేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థను కొంత మేర గాడిలో పెట్టామని అంటూ, అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు మరోసారి అవకాశమివ్వాలని నర్మగర్భంగా కోరారు.

అభివృద్ధికి మోదీ గ్యారెంటీ

ప్రతీ సమస్యకు తాను పరిష్కారం చూపగలనని మోదీ భరోసా ఇచ్చారు. అందరి అభివృద్ధి, రైతుల సాధికారత, మహిళా భద్రత లాంటి కీలక సమస్యలకు మోదీ గ్యారెంటీ అంటూ చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడిన మాటలకు అందుకు కొలమానంగా తీసుకోవాలి. మీ ఒక్క ఓటుతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా, ఢిల్లీలో మోదీ నాయకత్వం పటిష్టమవుతుందని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. అయోధ్య రామాలయ నిర్మాణం, వచ్చే జనవరిలో ప్రారంభోత్సవాలను ప్రస్తావిస్తూ… మధ్యప్రదేశ్ చిత్రకూట్ కూడా రామాయణ సర్క్యూట్ కిందకు వస్తుందన్నారు. ఆ క్రమంలో హిందీ రాష్ట్రాల్లో హిందూ వాదాన్ని మరోసారి ప్రచారం చేశారు. అలాగే మోదీ గ్యారెంటీస్ టు ఛత్తీస్ గఢ్ కూడా జనంలోకి బాగానే వెళ్లిందని చెప్పాలి.