సోమవారం పరమేశ్వరుడికి ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. మరీ ముఖ్యంగా కార్తీకమాసంలో సోమవారం మరింత ప్రత్యేకం. శాస్త్రాలలో శివలింగ పూజకు చాలా నియమాలున్నాయి. నియమానుసారంగా పూజిస్తే భోళాశంకరుడు వెంటనే కరిగిపోయి వరాలిస్తాడని భక్తుల విశ్వాసం. అయితే శివపూజలో వినియోగించకూడని కొన్ని వస్తువులున్నాయి. అవేంటి..ఎందుకు వినియోగించకూడదో పండితులు వివరిస్తున్నారు…
తులసి వద్దు
శివలింగం మీద తులసీదళాలను సమర్పించకూడదు. తులసి శ్రీమహా విష్ణువు, హనుమంతుడు, శ్రీ కృష్ణుడికి ప్రీతికరమైనవి. వీరికి చేసే పూజ తులసి లేకుండా సంపూర్ణం కాదు. కానీ శివ పూజకు తులసిని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు.
పసుపు
పూజలో పసుపు, కుంకుమ వినియోంచడం సాధారణం. అయితే శివ పూజలో భాగంగా శివలింగానికి పసుపు రాయకూడదంటారు పండితులు. పసుపును స్త్రీలింగంగానూ, శివలింగాన్ని పురుషాంశంగానూ పరిగణిస్తారు అందుకే పసుపు వినియోగించరాదు. అందుకే భస్మంతో పూజిస్తారు.
నువ్వులు
నువ్వులను కూడా శివలింగానికి సమర్పించరాదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, నువ్వులు విష్ణువు ధూళి నుంచి ఉద్భవించాయంటారు. అందుకే శివుడి పూజ చేసేటప్పుడు నువ్వులు వినియోగంచరాదంటారు.
విరిగిన బియ్యం
విరిగిన బియ్యం, ముక్కలుగా కనిపించే అన్న శివుడికి నైవేద్యంగా పెట్టరాదు. శివునికి విరిగిన బియ్యాన్ని సమర్పించడం అశుభం. నిజానికి పగిలిన అన్నం శివునికే కాదు, ఏ దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టకూడదు.
కొబ్బరి నీరు
శివారాధనలో కొబ్బరికాయను సమర్పించవచ్చుగానీ పొరపాటున కూడా కొబ్బరినీళ్లను శివలింగానికి సమర్పించకూడదు. శివుడు అభిషేకప్రియుడు.. నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేయాలి కానీ కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయరాదట.
ఈ పువ్వులు వద్దు
శివపూజలో ఎరుపు రంగు పూవ్వులు ఉపయోగించకూడదు. కేతకి, చంపా వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివపూజకు వాడకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా శివపూజకు ఈ పువ్వులు వాడినపుడు పూజకు తగిన ఫలితం దొరకదు.
బిల్వ పత్రాలు శివుడికి చాలా ఇష్టం అందుకే శివపూజలో వీటిని విరివిగా వాడుతారు. అయితే శివపూజకు సేకరించే బిల్వపత్రాలు శుభ్రంగా ఉండాలి కానీ చిరిగిపోయినవి, పురుగు తినేసిన బిల్వ పత్రాలను శివారాధనకు వినియోగించవద్దు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.