గాలి కొట్టుకోవడం కాదు కాంగ్రెస్ రియాలిటీ ఇదీ – నిప్పులాంటి నిజం !

తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ చరిత్ర మాత్రం వేరేలా ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచీ 52 స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేయలేకపోయింది. ఈసారి అధికారం తమదేనన్న ధీమాతో హస్తం నేతలు ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాలు కీలకంగా మారాయి. అంటే మిగిలిన 67 నియోజకవర్గాలపై మాత్రమే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుందని అనుకోవచ్చు.

కాంగ్రెస్ భ విష్యత్ ప్రశ్నార్థకం

ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ వరుసగా రెండుసార్లు ఓటమిపాలైంది. దీంతో రాష్ట్రంలో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ఆ పార్టీకి 2004 ఎన్నికలు ఊపిరి పోశాయి. అప్పట్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీఆర్‌ఎస్‌, వామపక్షాలతో కాంగ్రెస్‌ కూటమి కట్టి పోటీ చేసింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు సొంతంగా 48 సీట్లు మాత్రమే వచ్చినా.. మిత్రపక్షాలైన టీఆర్‌ఎ్‌సకు 26, వామపక్షాలకు పది సీట్లు వచ్చాయి. మొత్తంగా 84 సీట్లు కాంగ్రెస్‌ కూటమికి దక్కాయి.

టీడీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ మునక

టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ సీట్లు దక్కించుకోలేకపోయిన చరిత్ర మాత్రం దానిని వెంటాడుతోంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచే ఆ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తుండేవి. వైఎస్‌ నేతృత్వంలో జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి, పీఆర్పీ, బీజేపీ మధ్య చీలిపోయిన సంగతి తెలిసిందే. ఆ పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 50 సీట్లు మాత్రమే వచ్చాయి.

రాత మారుతుందా!

ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2009 ఎన్నికల్లో 50 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2014 ఎన్నికల్లో 21 సీట్లకు పడిపోయింది. ఇందులో 12 సిటింగ్‌ సీట్లు కాగా.. మిగిలినవి కొత్తగా గెలుచుకున్నవి. 2018 ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్‌, సీపీఐలతో జట్టు కట్టి పోటీ చేస్తే.. మరో రెండు సీట్లు తగ్గి 19 మాత్రమే గెలుచుకోగలిగింది. వీటిలో 15 సీట్లు కొత్తగా గెలిచింది. 2014, 2018 ఎన్నికలు రెండిటినీ కలుపుకొని 36 నియోజకవర్గాల్లో ప్రాతినిథ్యం దక్కించుకుంది. అంటే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 73 సీట్లలో బోణీయే కొట్టలేదు. మరి అధికారంలోకి రావాలంటే ఎలా సాధ్యం ?