డబ్బుల్లేకపోతే అంతే – రైతుబంధు అనుమతిని రద్దు చేయించిన హరీష్ రావు !

ఖజానాలో చిల్లిగవ్వలేదు. రైతుల ఖాతాల్లో రూ. 7700 కోట్లు వేయాలి. మరేం చేయాలి ? . నిబంధనలు ఉల్లంఘించి.. ఇచ్చిన అనుమతిని రద్దు చేయించాలి. తిరిగి బీజేపీపై నిందలేయాలి. ఇదీ బీఆర్ఎస్ ప్లాన్. పక్కాగా అమలు చేశారు. ఈసీ రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసేసింది.

కావాలనే హరీష్ వ్యాఖ్యలు

పోలింగ్ కు ముందు రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేసేందుకు వచ్చిన గొప్ప అవకాశాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కోల్పోయింది. అనుమతిని రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 28వ తేదీన రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తామని బీఆర్ఎస్ ను ఆదరించాలని హరీష్ రావు ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో చెబుతున్నారు. సిద్దిపేటలోనూ అదే చెప్పారు. ఆయన ఆర్థిక మంత్రి కావడంతో ఈ వ్యాఖ్యలను ఈసీ సీరియస్ గా తీసుకుని అనుమతి రద్దు చేసింది.

ముందే హింట్ ఇచ్చిన వ్యవసాయ శాక

ఖజానాలో డబ్బుల్లేవని.. ఉన్నవి ఉద్యోగుల జీత భత్యాల కోసం బిల్లులు పెట్టినవేనని.. వాటిని రైతు బంధు కోసం మళ్లించడం సాధ్యం కాదన్న భావన అధికారవర్గాల్లో వినిపించింది. వ్యవసాయ శాఖ ప్రకటన కూడా డబ్బులు జమ చేస్తామని ఎక్కడా చెప్పలేదు. మూడురోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.. 29, 30 వ తేదీల్లో ఈసీ జమ చేయవద్దని చెప్పిందని.. వ్యవసాయసాఖ చెప్పింది. అంటే 28వ తేదీ ఒక్క రోజు మాత్రమే డబ్బులు జమ చేయడానికి అవకాశం ఉంది. ఆ రోజున విడుదల చేస్తామని రైతుల ఖాతాల్లో నగదు పడి టింగ్ టింగ్ మని సౌండ్ వస్తుందని హరీష్ రావు చెప్పడం ప్రారంభించారు. చివరికి అదే కారణంగా రైతు బంధు అనుమతి ని రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

బీజేపీ పై నిందలేయడానికి వ్యూహాత్మక ప్రచారమా ?

అసలు రైతు బంధు అనే పథకానికి నిధులు గత ఏడాది డిసెంబర్ లో నిధులు ఇచ్చారు. అయినా పాత పథకం అని చెప్పి అనుమతి అడిగారు. నిబంధనల ప్రకారం అనుమతి వచ్చింది. అయితే ఈ నిర్ణయం సానుకూలంగా రావడం వెనుక బీజేపీ ఉందని ప్రచారం చేయించారు. కాంగ్రెస్ నేతలు అదే పనిగా విమర్శలు చేయించారు. ఇప్పుడు అనుమతి రద్దు కావడంతో… మళ్లీ బీజేపీనే చేయించిందని ఆరోపణలు గుప్పించే చాన్స్ ఉంది. రైతుల్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి రాజకీయం చేయడమేమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.