ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగు చోట్ల పోలింగ్ పూర్తయ్యింది. ఒక్క తెలంగాణలో మాత్రమే మిగిలి ఉంది. లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే ఈ ప్రక్రియలో ఆశాజనమైన ఫలితాలు వస్తాయని బీజేపీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. దానితో లోక్ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే ప్రక్రియకు అధిష్టానం శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
పొత్తు భాగస్వాముల చర్చలు కొనసాగింపు…
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభా స్థానాలున్నాయి. సీట్ల సర్దుబాటుపై బీజేపీ, శివసేన, ఎన్సీపీ మధ్య చర్చల ప్రక్రియ ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగుతోందని కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో ఒక దశ సర్వే పూర్తయ్యిందని, విజయాకాశాలున్న అభ్యర్థులను గుర్తించామని తేల్చేశాయి. 2019లో గెలిచిన వారికి తిరిగి టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉంది. అయితే అది ఫైనల్ నిర్ణయం కాదని, వ్యూహాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.
డిసెంబరు తర్వాత ప్రక్రియ వేగవంతం
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు నెలలో జరుగుతాయి. దాని తర్వాత రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచార ప్రక్రియను ప్రారంభిస్తామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ, శివసేన ( షిండే వర్గం) ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ప్రతినిధులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తారు. మూడు పార్టీలు కలిసి ప్రచారం చేయాలని ఎవరెక్కడ పోటీ చేసినా మిగతా మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సహకరించాలని స్థూలంగా ఒక ఒప్పందం కుదిరింది. మూడు పార్టీల కూటమి మహాయుతి కనిష్టంగా 42 చోట్ల గెలుస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది. మోదీ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వాసం ఉంచారని అందుకే తాము ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నామని కూడా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఒకటి రెండు సీట్లు ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..
మరాఠా రిజర్వేషన్ వివాదంతో ఇబ్బందులు
మరాఠా రిజర్వేషన్ వివాదంతో శాంతి భద్రతల సమస్య ఏర్పడి ప్రభుత్వానికి తలనొప్పులు తప్పలేదు. వరుస నిరసనలు, బంద్ లు, ఆమరణ దీక్షలతో అనిశ్చితి ఏర్పడి రాష్ట్రంలో పెట్టుబడులకు అవరోధంగా మారిన మాట వాస్తవమని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. దీనిపై మూడు పార్టీల కూటమిలో విభేదాలున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికల నాటికి సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుందని కూడా వారు ధీమాగా ఉన్నారు. ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు మరాఠా కోటాను అమలు చేస్తే, సుప్రీం కోర్టు దాన్ని నిలుపుదల చేసిందని గుర్తు చేశారు. సుప్రీం తీర్పును పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఓబీసీ కోటాకు ఎలాంటి అవరోధం లేకుండా మహాఠా రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా చెప్పారు. ఆ ఒక్క సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించి ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని బీజేపీ విశ్వసిస్తోంది.