గ్రేటర్‌లో ” గ్రేటర్ ఫలితాలు” రిపీట్ ఖాయమేనా ?

మినీ ఇండియాగా పిలిచే గ్రేటర్‌ ఓటర్ల తీర్పు ఈసారి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న అంశాన్ని నిర్ణయించబోతున్నది. గ్రేటర్‌ పరిధిలో 29 స్థానాలు ఉన్నాయి. ఎంఐఎం గత ఎన్నికల్లో 7 స్థానాల్లో గెలుపొందింది. మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్నది. మిగిలిన 22 స్థానాల్లో బీజేపీ ప్రధాన పోటీదారుగా ఉంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు.

గతంలో బీఆర్ఎస్‌కు అధికారం అందించిన గ్రేటర్

బీఆరెస్‌ 2014లో 3 సీట్లు మాత్రమే సాధించింది. కానీ 2018 ఎన్నికల్లో ఏకంగా 19 స్థానాలు దక్కించుకున్నది. కాంగ్రెస్‌పార్టీ 2009లో గ్రేటర్‌లోని 24 చోట్ల పోటీ చేసి 14 స్థానాలు గెలుచుకున్నది. అప్పటి నుంచి 2018 వరకు పెద్దగా సీట్లు గెలుచుకోలేదు. 2018లోనూ మహాకూటమి పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసి ఎల్బీనగర్‌, మహేశ్వరంలోనే మాత్రమే నెగ్గింది. అనంతరం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆరెస్‌లో చేరిపోయారు. దీంతో కంగ్రెస్ పరిస్థితి జీరో అయిపోయింది. గతంలో గెలిచిన స్థానాలను మళ్లీ గెలుచుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది.

బీఆర్ఎస్‌ ఆశలకు గండి కొడుతున్న బీజేపీ

గ్రేటర్‌ పరిధిలో బీజేపీ ప్రభావం కూడా బాగానే ఉంటుంది. ఆ పార్టీ గత ఎన్నికల్లో గోషామహల్‌లో మాత్రమే గెలుపొందింది. అప్పటి నుంచి 2018 వరకు పెద్దగా సీట్లు గెలుచుకోలేదు. 2014లో గెలిచిన ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, ఖైరతాబాద్‌, ఉప్పల్‌లను నిలబెట్టుకోవాలని భావిస్తున్నది. అదే సమయంలో శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాల్లోనూ తన బలమేమిటో చూపెట్టాలనుకుంటున్నది. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు ఉంది.

బీజేపీ వైపు ఫస్ట్ టైం ఓటర్లు

గ్రేటర్‌ వ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో ఎక్కువమొత్తంలో కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఇందులో 40 శాతం యువ ఓటర్లే ఉన్నారు. వీరు అభ్యర్థుల గెలుపోటమలను నిర్ణయించే సంఖ్యలో ఉండటం ప్రధాన పార్టీ అభ్యర్థులను కలవరపరుస్తున్నది. ఎందుకంటే 18-25 సంవత్సరాల లోపు యువతపై బీజేపీ భావజాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అందుకే గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లను గెలుచుకోవడానికి ఈ యూత్‌ ఓట్లు కూడా ఒక కారణం. గ్రేటర్‌లో కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరులో నేపథ్యంలో ప్రతి ఓటు కీలకమే. ఎవరు గట్టెక్కినా.. వెయ్యి, రెండు వేల మెజారిటీతోనే అని అంటునారు. అంతిమంగా బీజేపీకి మేలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.