ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు సకల కష్టాల నుంచి బయటపడొచ్చని విశ్వసిస్తారు. ప్రతిశుక్రవారం పూజ ఓ లెక్క అయితే కార్తీకమాసంలో లక్ష్మీపూజ మరింత ప్రత్యేకం. ఎందుకంటే…
శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. కార్తీకమాసంలో ఉసిరి కాయపై దీపాలు వెలిగించడం మరింత శుభకరం అంటారు పండితులు. ఉసిరికాయల హారతిని ఇవ్వడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, ఆయురారోగ్యాలతో ఉంటారు. లక్ష్మీదేవిని పూజించిన తర్వాత శ్రీ శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం పఠించాలి. పూజ పూర్తైన తర్వాత కూడా ఉసిరికాయతో హారతిస్తే ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణం తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుందని నమ్మకం.
కార్తీకంలో ఉసిరి దీపం ప్రత్యేకం
కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా అష్టదరిద్రాలు తొలగిపోతాయంటారు. ఆయుర్వేద పరంగా కూడా ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయాలని చెబుతారు. నిత్యం ఉసిరి దీపం వెలిగించకపోయినా కార్తీకమాసంలో క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలపై వత్తులు పెట్టి వెలిగిస్తారు. ఉసిరి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు స్వరూపం అని…సకల దేవతలతో విష్ణమూర్తి లక్ష్మీ సమేతంగా ఆ వృక్షంలో కొలువై ఉంటాడని అందుకే కార్తీకమాసంలో ఉసిరిచెట్టు దగ్గర దీపం వెలిగించినా, ఉసిరి పై దీపం వెలిగించినా వారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందంటారు.
ఉసిరి దీపం ఇలా వెలిగించండి
కొందరు నేరుగా వత్తిని ఉసిరికాయపై పెట్టేస్తారు కానీ…ఉసిరికాయను పైన మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే దీపం పెట్టుకోవడానికి వీలుగా తయారవుతుంది. ఇందులో నెయ్యి నింపి తామర కాడల వత్తులు లేదా పువ్వొత్తులను పెట్టి వెలిగించవచ్చు. ఇలా దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాలతో పాటూ నరదిష్ఠి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఉసిరికాయ అంటే లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టం. కార్తీకమాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి విష్ణువు, లక్ష్మీ దేవిల అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి కార్తీకమాసంలో ఉసిరి దీపం పెడితే ఎంతో మంచిది.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.