కమలనాథుల విజయదరహాసానికి సిద్ధమవుతున్న ఎడారి రాష్ట్రం

మోదీ సాథే అప్నో రాజస్థాన్.. అంటే మోదీ వెంటే మన రాజస్థాన్.. ఈ నినాదాన్ని బీజేపీ నేతలు ఒక పాట రూపంలో ప్రచారం చేశారు. జనానికి ఆ పాట ఎంతో నచ్చింది. పాట నచ్చడమొక్కటే కాదు. పాటకు సొంతదారుడైన మోదీ అంటే కూడా అభిమానం పెరిగింది. మోదీ అంటే మనం, మనమంటే మోదీ అన్నంత రేంజ్ లో ఉద్వేగం పొంగింది. అదీ ఓట్ల రూపంలో మారబోతోందన్న విశ్వాసం బీజేపీ వర్గాల్లో పెరిగింది. కాంగ్రెస్ టెన్షన్ కు కూడా అదే కారణమవుతోంది.

మహిళలు, యువత ఆగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే దశలో శనివారం (నవంబరు 25) జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కాంగ్రెస్ కు పూర్తి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా మారాయి. ప్రభుత్వం రూ.500కే ఎల్పీజీ సిలెండర్ ఇచ్చినంత మాత్రాన జనం సంతోష పడతారనుకోవడం పొరపాటే అవుతోంది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతల స్థాపనలో వైఫల్యం చెందిందని మహిళలు ముక్తకంఠంతో చెబుతున్నారు. అత్యాచారాలు బాగా పెరిగిపోయాయని అంటున్నారు. 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. ఉద్యోగ కల్పనలో విఫలమైనందున యువత తీవ్ర అసంతృప్తితో ఉంది. ఐదేళ్ల కాలంలో 18 సార్లు పేపర్ల లీకేజీ వారి ఆగ్రహాన్ని మరింతగా పెంచింది.

కులం, అభ్యర్థి,పార్టీలు..

అనేక రకాల వైరుధ్యాలున్న ఎడారి రాష్ట్రంలో కులం చాలా ప్రాధాన్యం వహిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుజ్జర్లు కాంగ్రెస్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. రాజ్ పుత్రులు మరోసారి బీజేపీకి జై కొడుతున్నారు. మేవార్ ప్రాంతంలో ఒకప్పుడు రాజపుత్రులు బీజేపీ పట్ల అలిగారు. ఇప్పుడు రాజకుటుంబానికి చెందిన దియా కుమారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారన్న విశ్వాసం నడుమ వాళ్లు బీజేపీకి మద్దతిస్తున్నారు.బీజేపీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ తో అభ్యర్థులు కూడా జనానికి నచ్చేశారు. ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్న ప్రయోగంతో ఓటర్లలో సానుకూలత ఏర్పడింది. ఆ క్రమంలో అప్పటికే ఎమ్మెల్యేలుగా ఉండి ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న వారిని పక్కన పెట్టినట్లయ్యింది. హిందూత్వం కూడా ఈ ఎన్నికల్లో బాగానే పనిచేసింది. కన్హయ్య లాల్ హత్య ఉదయ్ పూర్ నగరాన్ని కుదిపేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని హిందువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

తీరని గెహ్లాట్, పైలట్ వివాదం…

కాంగ్రెస్ లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య సీఎం పదవి వివాదం ఇప్పటికీ చల్లారలేదు. కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని రాజీ పెట్టినట్లే కనిపించినా వారిద్దరూ కలిసిందీ లేదు. ఇంతవరకు ఇద్దరూ ఒకే సభలో ప్రసంగించిందీ లేదు. వారిద్దరి అనుచరులు కూడా కలిసి పనిచేయడం లేదు. మరో పక్క బీజేపీలో సీఎం పదవిపై ఎలాంటి వివాదమూ లేదు. మోదీ ఎవరిని సమర్థిస్తే వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని పార్టీ వారు చెబుతున్నారు.