రాజస్థాన్లో సమీకరణాలు మారుతున్నాయి. బలమైన సామాజికవర్గాలను దూరం చేసుకున్న పార్టీలకు గడ్డుకాలం తప్పదని తెలుస్తోంది. ముఖ్యంగా గుజ్జర్లు కాంగ్రెస్ పార్టీపై పీకల దాకా కోపంతో ఉన్నారు. అది స్వయంకృతాపరాథమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
స్వయంగా ప్రధాని నోట సచిన్ మాట
ప్రధాని మోదీ ఇటీవల కోటాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. ఆ సందర్భంగా సచిన్ పైలట్ వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు. సచిన్ తండ్రి రాజేష్ పైలట్ ….అప్పట్లో గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసినందుకే ఇప్పుడు సచిన్ వై కక్షసాధిస్తున్నారని మోదీ ఆరోపించారు. అప్పట్లో సీనియర్ పైలట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అది సోనియాకు నచ్చనందునే ఇప్పుడు అన్ని విధాలా సచిన్ ను అవమానపరుస్తున్నారని బీజేపీ అంటోంది.
2018లో గుజ్జర్ల ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే..
సచిన్ పైలట్ గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన నేత. 2018లో కాంగ్రెస్ గెలిస్తే ఆయనకే ముఖ్యమంత్రి పదవి వస్తుందని గుజ్జర్లంతా ఆశించారు. దానితో హస్తం పార్టీకి ఓటేశారు. గుజ్జర్లు ఎక్కువగా ఉండే తూర్పు రాజస్థాన్లో గంపగుత్తగా గుజ్జర్ల ఓట్లు కాంగ్రెస్ కే వెళ్లాయి. అక్కడి 54 స్థానాల్లో 14 మాత్రమే బీజేపీకి చేరాయి. దౌసా, సవాయ్ మాధోపూర్, కరౌలీ, భరత్ పూర్ జిల్లాలో బీజేపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. కాంగ్రెస్ కు 99 స్థానాలు వచ్చి అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి కావడానికి గుజ్జర్ల ఓట్లే కారణమని చెప్పాలి.
సచిన్ పైలట్ కు వరుస అవమానాలు….
2018లో అధికారానికి వచ్చిన వెంటనే సచిన్ పైలట్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారన్న అక్కసుతో అశోక్ గెహ్లాట్ ఆయన్ను పూర్తిగా అణచివేసేందుకు చేయని ప్రయత్నం లేదు. తొలుత పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవికి ఉద్వాసన పలికారు. ఆయన అనుచరులందరినీ పక్కన పెట్టారు. తమ సామాజిక వర్గం నాయకుడు సీఎం కావాలని కాంగ్రెస్ కు ఓటేస్తే పరిస్థితి ఇలా తయారైందేంటని గుజ్జర్లంతా ఆలోచనలో పడ్డారు.
నిజానికి గుజ్జర్లు తొలి నుంచి బీజేపీ సమర్థకులు. వాళ్లకు వాజ్ పేయి, ఆడ్వాణీ అంటే వల్లమాలిన అభిమానం. ఎప్పుడూ బీజేపీకే ఓటేసేవారు. గత ఎన్నికల్లో మాత్రం సచిన్ పైలట్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ వైపు దృష్టి సారించారు. ఆ పని జరగకపోగా తమ కులం నేతకు వరుస అవమానాలు జరుగుతున్నాయన్న అక్కసు వారిలో ఉంది. దానితో ఇప్పుడు మళ్లీ బీజేపీకే ఓటేసి కాంగ్రెస్ ను ఓడించాలన్న ఆలోచన గుజ్జర్లలో కలుగుతున్నట్లు చెబుతున్నారు. మరో పక్క ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సచిన్ పైలట్ ఆచి తూచి మాట్లాడుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని ఆయన సమాధానమిస్తున్నారు.