పంచభూత క్షేత్రాలివే..మీరెన్ని దర్శించుకున్నారు

శైవ క్షేత్రాల్లో జ్యోతిర్లింగాలు, పంచారామాలతో పాటూ అత్యంత విశిష్టమైనవి పంచభూత లింగాలు కొలువైన క్షేత్రాలు. పంచభూతాధిపతి పంచభూతాలుగా కొలువైన ఆ ఆలయాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది మిగిలిన 4 తమిళనాడులో ఉన్నాయి. ఈ పంచభూత లింగాలను కార్తీకమాసంలో దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం…

పృథ్విలింగం – కంచి
పంచభూతలింగాల్లో పృథ్వి లింగం కొలువైన క్షేత్రం తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం. ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని చెబుతారు. ఒకానొక సమయంలో గంగమ్మ… లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుందనీ, అందుకు నిదర్శనగా అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయని చెబుతారు.

ఆకాశలింగం – చిదంబరం
పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశ లింగం తమిళనాడు చిదంబరంలో కొలువుతీరింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ….మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు.

జలలింగం – జంబుకేశ్వరం
తమిళనాడు కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం. ఇందుకు సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. భక్తులకు ఈ విషయం తెలిసేందుకు పానపట్టుపై ఓ వస్త్రం కప్పుతారు. కొద్దిసేపటికి ఆ వస్త్రాన్ని తీసి నీళ్లు పిండి మళ్లీ పరుస్తుంటారు.
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు.

తేజోలింగం – అరుణాచలం
దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం . ఇక్కడి స్వామిని అణ్ణామలైగా పిలుచుకుంటారు. పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే ఈ అరుణాచలం. అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తుంది. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం.

వాయులింగం – శ్రీ కాళహస్తి
ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలిసింది వాయులింగం. సాధారణంగా ఏ దేవాలయం గర్భాలయంలోకి గాలి రావడానికి అవకాశముండదు. కానీ ఇక్కడ స్వామివారికి ఇరువైపులా ఉన్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో వుంటాయి. దీనితో స్వామి వారి శ్వాస తగిలి ఇలా జరుగుతుందంటారు. అందుకే ఇక్కడ వాయులింగంగా ప్రసిద్ధి.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.