బీజేపీ అంతర్గత రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అలిగి కాస్త దూరంగా ఉన్న వారు సైతం ప్రధాని మోదీ నాయకత్వ బలాన్ని గుర్తించి దారికి వస్తున్నారు. రాజస్థాన్ పోలింగ్ కు రెండే రోజులున్న తరుణంలో మాజీ సీఎం వసుంధరా రాజే కూడా నేను సైతం అంటూ అందరితో కలిసిపోతున్నారు.
మోదీ వేదికపై వసుంధర
మేడమ్ అలిగారు.. రెండు నెలల క్రితం వరకు రాజస్థాన్ బీజేపీలో ఇది హాట్ టాపిక్. మేడం అందరితో కలిసిపోయారు.. తాజాగా అందరి నోళ్లలో నానుతున్న మాట. బారన్ జిల్లా అంటా పట్టణంలో బీజేపీ నిర్వహించిన భారీ రాలీకి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరైతే ఆయనను ఆహ్వానించేందుకు మాజీ సీఎం వసుధరా రాజే స్వయంగా వచ్చారు. పైగా మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ.. దేశ ప్రజలంతా ఆయన హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రపంచమే మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తోందని ఆమె ప్రశంసించారు. ఝాల్వర్ – బారన్ నియోజకవర్గానికి లోక్ సభ సభ్యుడిగా ఉన్న వసుంధర కుమారుడు దుష్యంత్ సింగ్ కూడా ఆ సభకు హాజరయ్యారు. పైగా తల్లీ, కొడుకులిద్దరూ మోదీకి చెరో పక్కన కూర్చున్నారు. ఇద్దరితో మోదీ చాలా సేపు మాట్లాడుతూ కనిపించారు..
పార్టీ వైఖరికి సమర్థింపు..
కొంతకాలం అంటీ ముట్టనట్లుగా ఉన్నప్పటికీ వసుంధర ఇప్పుడు పార్టీ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకున్నారు. ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే విధానం ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని గుర్తించారు. పార్టీ పెద్దల బుజ్జగింపులకు దిగి వచ్చారు. అలిగితే ఆమెకు, ఆమె కుటుంబానికే నష్టమని దాని వల్ల పార్టీకి పోయేదేమీ లేదని పెద్ద నచ్చజెప్పారు. ఎన్నికల వేళ పార్టీకి, అగ్రనాయకత్వానికి దూరంగా ఉంటే ఆమె పట్ల రాంగ్ సిగ్నల్స్ వెళ్తారని కూడా పార్టీ వ్యూహకర్తలు వివరించడంతో వాస్తవ స్థితి ఆమెకు తెలిసొచ్చింది. నిదానంగా అందరినీ కలుపుకుపోతూ, అందరితో కలిసిపోతూ అనుకున్నది సాధించాలన్న నిర్ణయానికి వచ్చారు.
దియా కుమారికే సీఎం పదవి ?
బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరికన్న చర్చకు కూడా దాదాపుగా తెరపడింది. విద్యా నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దియా కుమారికి సీఎం పదవి ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియాకుమారి.. నాటి రాజు మాన్ సింగ్ మనవరాలు.రాజ్ సమంద్ లోక్ సభా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమెను ముఖ్యమంత్రిని చేసేందుకే అసెంబ్లీ బరిలోకి దింపారని భావిస్తున్నారు. నిజానికి దియా కుమారి రాజకీయాల్లో వసుంధర శిష్యురాలని చెప్పక తప్పదు. ఇప్పుడు మాత్రం గురువుకు కాకుండా శిష్యురాలికి సీఎం పదవి ఇచ్చే సీన్ కనిపిస్తోంది. ఐనా వసుంధర సంయమనం పాటించాలని నిర్ణయించారు. బహుశా తన కుమారుడు దుష్యంత్ రాజకీయ భవిష్యత్తును పటిష్టం చేసుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవాలి….