మల్కాజిగిరి అసెంబ్లీలో సైలెంట్ వేవ్ – డబ్బు చేసిన నేతలకు బీజేపీ గట్టి పోటీ !

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం గ్రేటర్ పరిధిలో ప్రత్యేకమైనది. మినీభారత్‌ను తలపించే మల్కాజిగిరి నియోజకవర్గంలో భిన్న సామాజిక వర్గాల ఓటర్లున్నారు. బీసీ వర్గానికి చెందిన యాదవులు, ముదిరాజ్‌లు, గౌడ్‌లు, ఇతరత్రా కులాల ఓట్లు 3 లక్షలకుపైగా ఉంటాయని అంచనా. కాగా, బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లూ దాదాపు 40 వేల వరకు ఉంటాయని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు 50 వేలు, రెడ్డి ఓటర్లు 20 వేలు, మైనారిటీలు 20 వేల వరకు ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో మెజారిటీ ఓటర్లు బీజేపీకి అండగా ఉంటారన్న అభిప్రాయం ఉంది.

బీజేపీ అభ్యర్థిపై సానుభూతి

న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ, ఎన్‌.రాంచందర్‌రావు బీజేపీ అభ్యర్థిగా వరుసగా మూడోసారి మల్కాజిగిరి బరిలో నిలిచారు. 2014లో స్వల్ప తేడాతోనే ఆయన పరాజయం పాలయ్యారు. రెండు పర్యాయాలు ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి సానుభూతి ఉంటుందన్న అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. దీంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరిష్మా కలిసి వస్తుందని భావిస్తున్నారు. తనకు వయసు రీత్యా ఇవే చివరి ఎన్నికలు కావచ్చని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతూ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇద్దరు బాగా డబ్బున్న నేతల మధ్య రామచంద్రరావు ప్రచారం వినూత్నంగా సాగుతోంది.

మల్కాజిగిరి ఓటర్లు చైతన్యవంతులు

మల్కాజిగిరి నియోజకవర్గం 2009లో ఏర్పడగా.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఆకుల రాజేందర్‌ విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతల కనకారెడ్డి.. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఏకంగా 73 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. అయితే ఈసారి అనూహ్య పరిణామాల నేపథ్యంలో హన్మంతరావు పార్టీ మారి.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మరోవైపు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కించుకుని పోటీ పడుతున్నారు.

డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

మల్కాజిగిరి నియోజకవర్గంలో డబ్బు ఏరులై పారుతోంది. నామినేషన్ల సమయం నుంచే డబ్బు పంపిణీ ప్రారంభించారు. మైనంపల్లి డబ్బు ఖర్చులో వెనుకాడరు. అలాగే.. మల్లారెడ్డి అల్లుడు కూడా . 2019లో ఆయన ఇదే పార్టీ నుంచి మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు కావడం, ఆర్థికంగా బలవంతుడు కావడంతో మైనంపల్లిని ఎదుర్కొనేందుకు రాజశేఖర్‌రెడ్డి సమర్థుడైన అభ్యర్థిగా అధిష్ఠానం భావించింది. ఆ సమర్థత డబ్బు వల్ల వచ్చిందని అందరికీ తెలిసిందే. ఇద్దరూ విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ.. ప్రజల్లో వ్యతిరేకత పెంచుకుంటున్నారు. సౌమ్యుడైన రామచంద్రరావు వైపు మధ్యతరగతి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.