ప్రతీ దానిలో రాజకీయం వెదుక్కొవడం దేశంలో విపక్షాలకు అలవాటైపోయింది. అధికార పార్టీ మంచి పని చేసినా దానిలో తప్పులు వెదికేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రధాని మోదీ.. రామా అన్నా కూడా అందులో వారికి బూతు కనిపిస్తుంది. చివరకు గెలుపును, ఓటమిని సమానంగా తీసుకోవాల్సిన క్రికెట్లోనూ అధికార పార్టీని విమర్శించేందుకు, అనకూడని మాట అనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెనుకాడలేదు…
మోదీ దుశ్శకునమట…
క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు ఓడిపోయింది. అది నిజంగా బ్యాడ్ లక్. టోర్నీ మొదటి నుంచి అప్పటి వరకు అప్రతిహతమైన విజయాలను నమోదు చేస్తూ వచ్చిన టీమిండియా ఆ రోజు కేవలం టైమ్ బాగోలేక పరాజయం పాలైంది. ఒకటి రెండు చెత్త షాట్లు కొట్టడం, ఆస్ట్రేలియా ఫీల్డింగ్ బాగా ఉండటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఎక్కువ స్కోర్ చేయలేక ఓటమి పాలైంది. ఈ మాట ఎవరినీ అడిగినా చెబుతారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం విపరీత వాదాలు చేస్తోంది. ‘‘స్టేడియంలోకి చెడు శకునం (పనౌతీ) వచ్చాడు. అంతే! అప్పటి వరకు గెలిచి తీరుతుందని అనుకున్న టీమిండియా ఓడింది’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగారా అంటే లేదనే చెప్పాలి. మోదీ డ్రెస్సింగ్ రూముకు వెళ్లి క్రీడాకారులను ఓదార్చితే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది. ‘‘భారత్లో ఆయనో.. డ్రామా మాస్టర్’’ అని వ్యాఖ్యానించింది. ‘‘అదో నృత్య రూపకం.. నటనకు పరాకాష్ఠ’’ అని పేర్కొంది.‘‘ఇలాంటి ఎత్తుగడలతో భారత యువతను మోసగించలేరు’’ అని కూడా జైరాం రమేష్ వ్యాఖ్యానించారు..
బీజేపీ గట్టి జవాబు
కాంగ్రెస్ వ్యాఖ్యలకు బీజేపీ గట్టి జవాబిస్తూ హస్తం పార్టీ దిగజారుడుతనాన్ని ఎండగట్టింది. ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ‘చెడు శకునం’తో పోల్చడం పట్ల బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాహుల్ గాంధీ ఎంచుకున్న పదాలు అభ్యంతరకరం. ఆయనకు అసలు ఏమైంది. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలి’’ అని అన్నారు. ‘‘గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని సోనియా తిట్టారు. ఏం జరిగింది? ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు రాజస్థాన్లోనూ అంతే జరుగుతుంది’’ అని రవిశంకర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మర్యాద పాటించడం నేర్చుకోవాలని బీజేపీ అంటోంది.
అఖిలేష్ మరో వాదన..
ఇండియా గ్రూపులోనే భాగమైన మరో పార్టీ సమాజ్ వాదీ నేత అఖిలేష్ యాదవ్ వాదన మరీ వింతగానూ, కాస్త ఎగతాళిగానూ అనిపించింది. వరల్డ్ కప్ ఫైనల్ గుజరాత్ లో కాకుండా లక్నోలో జరిపి ఉంటే భారత జట్టు గెలిచేదని ఆయన కొత్త వాదన తెరపైకి తెచ్చారు. లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే విష్ణు భగవానుడు, అటల్ బిహారీ వాజ్ పేయి, ఉత్తర ప్రదేశ్ ప్రజల ఆశీస్సులతో టీమిండియా గెలిచేదని విశ్లేషించారు. పైగా పిచ్ లో ఏదో లోపం ఉందని అంటూ క్యూరేటర్ ను తప్పుపట్టేందుకు ఆయన ప్రయత్నించారు. ఆయన మాటలు, ఆయన వైఖరి కరెక్టా కాదా…అన్నది జనమే నిర్ణయించాలి.