ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగుతుంది. ఆయన ఏ రాష్ట్రంలో ప్రచారం చేసినా… ఓ భారీ రోడ్ షో నిర్వహిస్తారు. అది కనీసం వంద కిలోమీటర్లకుపైగానే ఉంటుంది. ఇటీవల రాజస్థాన్ లోనూ అలాంటి రోడ్ షో నిర్వహించారు. హైదరాబాద్ లోనూ తనదైన ముద్ర వేసేందుకు మోదీ రెడీ అయ్యారు. ఎల్బీనగర్ నుంచి పటాన్ చెరు వరకూ రోడ్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోడ్ షో చరిత్ర సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
మూడు రోజుల పాటు హైదరాబాద్ లో మోదీ ప్రచారం
తెలంగాణ ఎన్నికల్లో సత్తాచాటేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రచారంలో వేగం పెంచింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు, కేంద్ర మంత్రులు పలు నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించారు. ప్రచారం గడువు చివరి మూడు రోజుల్ోల ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడంతో పాటు హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షో మోదీ పాల్గోనున్నారు.
జన ప్రభంజనం ఖాయం
ఈనెల 25, 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 25న కరీంనగర్ సభలో, 26న నిర్మల్ సభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. 27న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన భారీ రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు. ఎల్బీనగర్ నుంచి పటాన్ చెరు వరకు మోదీ రోడ్ షోకు బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రనాళిక చేస్తోంది. విజయమే లక్ష్యంగా మోదీ సభలకు జన సమీకరణ జరగనుంది. రోడ్ షో జరిగే రోజున హైదరాబాద్ లో పండుగ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
బీజేపీ అగ్రనేతల ప్రచారం
రాజస్థాన్ లో ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో కీలక నేతలంతా తెలంగాణకు వస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సభల్లో పాల్గొంటున్నారు. ఉత్తరాది నేతలు .. ఉత్తరాది ఓటర్లు ఉన్నదగ్గర ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉన్న నేతలు.. అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రఛారం ధాటిని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. ప్రచారంలో బీజేపీ చాలా దూకుడుగా ఉంది.