రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 25న జరుగుతున్న వేళ…వీఐపీ నియోజకవర్గాలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఏ పెద్ద మనిషి గెలుస్తాడు. ఎవరు ఓడిపోయే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలా మాట్లాడుకుంటున్న నియోజకవర్గాల్లో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మళ్లీ పోటీ చేస్తున్న టోంక్ కూడా ఒకటని చెప్పక తప్పదు..
గత ఎన్నికల్లో ఘన విజయం…
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సచిన్ పైలట్ తన సమీప ముస్లిం అభ్యర్థి యూనుస్ ఖాన్ పై 55 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. నాడు ఆయన సామాజికవర్గమైన గుజ్జర్లు, ముస్లింలు కలిసి సచిన్ ను గెలిపించారు. ఇప్పుడు కూడా అదే కాంబినెషన్ గెలిపిస్తుందని సచిన్ పైలట్ భావిస్తుండగా ప్రత్యర్థి బీజేపీ మాత్రం అంత సీన్ లేదని వాదిస్తోంది.
స్థానికేతర అంశాన్ని ప్రస్తావిస్తున్న మెహతా
బీజేపీ తరపున ఈ సారి టోంక్ లో అజిత్ సింగ్ మెహతా బరిలోకి దిగారు. పార్టీలో సీనియర్ అయిన ఆయన సచిన్ పైలట్ ను ఓడించి తీరుతానని చెబుతున్నారు. గత ఎన్నికల్లో పైలట్ గెలిచిన పరిస్థితులు వేరని, ప్రస్తుత స్థితిగతులు వేరని ఆయన వాదిస్తున్నారు. 2018లో సచిన్ సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగారని అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాటను జనం విశ్వసించారని ఆయన చెబుతున్నారు. అందుకే స్థానికేతరుడైనప్పటికీ సచిన్ ను గెలిపించారని, ఇప్పుడు మాత్రం బయట నుంచి వచ్చిన నాయకుడి పట్ల జనం సుముఖంగా లేరని మెహతా విశ్లేషించారు. పైగా సచిన్ విజయం కోసం, జైపూర్ కంటే లాహోర్ నగరంలో ఎక్కువ మంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని మెహతా ఆరోపించారు. కులాలు, మతాలను రెచ్చగొట్టి గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఈ సారి ఆ పప్పులు ఉడకవని మెహతా చెప్పుకొచ్చారు. టోంక్ ఎన్నికలో బీజేపీ అస్తిత్వం కంటే, ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యమివ్వడం ముఖ్యమని ఆ పార్టీ చెబుతోంది. అందుకే సర్వశక్తులు ఒడ్డి పైలట్ ను ఓడిస్తామని చెబుతోంది.
విజయంపై పైలట్ ధీమా…
సచిన్ పైలట్ మాత్రం బీజేపీ ఆరోపణలను పట్టించుకోవడం లేదు. ప్రజల కోసం తాను చేసిన మంచి పనులే గెలిపిస్తాయని అనుకున్నది సాధిస్తానని ఆయన చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని ఆయన అంటున్నారు. ప్రజావైద్యం, విద్య, యువతకు ఆవకాశాల విషయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టడం వల్లే టోంక్ లో అన్ని సదుపాయాలు వృద్ధి చెందాయంటున్నారు. తన కార్యక్రమాలతో టోంక్ మాత్రమే కాకుండా జిల్లా మొత్తం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని ఆయన చెప్పారు. మరి సచిన్ గెలుస్తారా.. స్థానిక బీజేపీ నేతకే అవకాశం వస్తుందా అంటే డిసెంబరు 3న ఫలితం వరకు వేచి చూడాల్సిందే.