ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గంలో సులువుగా గెలుస్తుందని ఇప్పటికే సర్వేలు తేల్చాయి. అదే జిల్లాలో మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు గట్టి పోటీ ఇస్తున్నారు. మరో నియోజకవర్గం మక్తల్ లో ప్రచారంలో దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి ప్రత్యర్థులకు షాకివ్వడం ఖాయమన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమైంది.
మక్తల్ లో హోరాహోరీ పోరు
మక్తల్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు రాజకీయ రక్తి కట్టిస్తోంది. హ్యాట్రిక్ గెలుపు కోసం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి… మొదటిసారి టికెట్ దక్కించుకున్న నారాయణ పేట డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి విజయం కోసం విశ్వప్రయత్నం.. బీజేపీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న జలంధర్ రెడ్డి తనబలం నిరూపించుకునేందుకు మక్తల్ ఓటర్ల ముందు నిలబడ్డారు. ఈనియోజకవర్గంలో ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తూ, జనాన్ని ఆకట్టుకునే పనిలో పడ్డారు.
నమ్మకంగా బీజేపీ అభ్యర్థి జలంధర్ రెడ్డి
బీజేపీ అభ్యర్థిగా జలంధర్ రెడ్డి రెండోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఇదే పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇంతకాలం పార్టీని నమ్ముకుని, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారనే భావనలో అధిష్టానం గుర్తించి బరిలో నిలిపింది. బీజేపీ క్యాడర్ పార్టీ కోసం పనిచేస్తుండడం జలంధర్ రెడ్డికి కలిసివస్తుందని చెబుతున్నారు. జలంధర్ రెడ్డి విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన కోసం బీజేపీ అనుబంధ విభాగాలు నేరుగా ఓటర్లను కలుస్తున్నాయి.
బీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రజా వ్యతిరేకత
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామ్మోహన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే ఉదేశంలో ఉన్నారు. దివంగత చిట్టెం నర్సిరెడ్డి వారసునిగా రాజకీయంలో ప్రవేశించిన రామ్మోహన్ రెడ్డి 2014లో మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం పొందారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొంది రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఆయన వ్యవహార శైలి విమర్శలపాలైంది. సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన ప్రజలకు అందుబాటులో ఉండరనే అభిప్రాయం ఉంది. కోపం కూడా రామ్మోహన్ రెడ్డికి ఈ నియోజకవర్గంలో కొంత మైనస్ గా మారింది. తన కోపమే ఆయనకు శత్రువు గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడోసారి విజయం
కష్టమన్న భావనలో ఉన్నారు.
నీరసంగా కాంగ్రెస్ ప్రచారం
నారాయణ పేట జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ఉన్న వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ లోని ప్రధాన సామాజికవర్గం సహకరించడం లేదు. అందుకే ప్రచారం మెల్లగా సాగుతోంది.