నిత్యం ఆలయాలను సందర్శించేవారు కొందరు..పండుగలు, ప్రత్యేక రోజుల్లో వెళ్లేవారు మరికొందరు. అయితే పిరియడ్స్ సమయంలో పొరపాటున కూడా దైవసన్నిధికి వెళ్లరు. ఇంట్లో కూడా దైవారాధనకు, శుభకార్యాలకు దూరంగా ఉంటారు. అయితే ఓ ఆలయానికి మాత్రం ఇలాంటి నిబంధనలేమీ లేవు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పూజలు స్త్రీలు మాత్రమే చేస్తారు. అంటే..అర్చకులుగా పురుషులు కనిపించరు స్త్రీలు మాత్రమే ఉంటారు. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది.
లింగ రూపంలో అమ్మవారు
సాధారణంగా పరమేశ్వరుడు లింగరూపంలో కనిపిస్తాడు కానీ ఇక్కడ అమ్మవారు లింగరూపంలో దర్శనమిస్తుంది. ఈశా యోగా కేంద్రంలో ఉన్న ఈ ఆలయంలో లింగ భైరవి దేవిని, సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్ 2010లో ప్రతిష్టించారు. దేవీ ప్రతిష్టాపన “ప్రాణ ప్రతిష్ట” ప్రక్రియ ద్వారా జరిగింది. సహజంగా ఏ దేవతామూర్తి ప్రతిష్ట అయినా మంత్రం లేదా హోమం ద్వారా జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ట ఒక యోగిలో ఉండే ప్రాణ శక్తిని ఉపయోగించి దేవతామూర్తిలో శక్తి నింపే విధానం. కాలరాత్రి లాంటి నల్లటి ఛాయతో, తీక్షణమైన కళ్ళతో, వెలుగులు చిమ్మే త్రినేత్రంతో, తన వైభవాన్ని చాటే బంగారు రంగు చీరతో, పది చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది లింగ భైరవి దేవి. అమ్మవారు లింగ రూపంలో కొలువై ఉన్న ఆలయాలు చాలా అరుదు …భక్తులకు అందుబాటులో ఉన్న దేవతామూర్తి మాత్రం ఇదొక్కటే.
రుతుక్రమంలో మహిళలకు ప్రవేశం
కోయంబత్తూర్‌లో “మ లింగ భైరవి” ఆలయం మహిళలు రుతుక్రమం సమయంలో కూడా అమ్మవారిని ఆరాధించడానికి అనుమతిస్తుంది. ఆలయానికి పురుషులు కూడా వెళ్లొచ్చు కానీ గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేసే అనుమతి మహిళలకు మాత్రమే ఉంటుంది. సాధారణంగా హిందువులు రుతుక్రమాన్ని అపవిత్రంగా పరిగణిస్తారు. రుతుక్రమంలో ఉన్న బాలికలు , స్త్రీలు ప్రార్థనలు చేయడం, భక్తి సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం నిషిద్ధం అంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అలాంటి ఆంక్షలేమీ లేవంటారు నిర్వాహకులు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.