ఏపీ బీజేపీకి బీఎల్ సంతోష్ దిశానిర్దేశం – ఎట్టకేలకు తొలి కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ బీజేపీని గాడిలో పెట్టేందుకు బీజేపీ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ స్వయంగా రంగంలోకి దిగారు. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షురాలిని నియమించిన తర్వాత పార్టీ కార్యకాలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. అదే సమయంలో మెజార్టీ నేతలు సైలెంట్ అయిపోయారు. మొత్తంగా ఏపీ బీజేపీ ఇన్‌యాక్టివ్ గా మారే పరిస్థితి కనిపిస్తూండటంతో చక్కదిద్దేందుకు బీఎల్ సంతోష్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. బీజేపీ కార్యవర్గ సమావేశానికి బీఎల్ సంతోష్ హాజరవుతున్నారు.

పురందేశ్వరి అధ్యక్షులయ్యాక తొలి సారి కార్యవర్గ సమావేశం

సాధారణంగా కొత్తగా ఎవరైనా అధ్యక్షులు నియామకం అయితే కార్యవర్గాన్ని మారుస్తారు. పురందేశ్వరి కూడా మార్చారు. కానీ ఇంత వరకూ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించలేకపోయారు. దీనికి కారణం ఏమిటో బీజేపీ నేతలకూ తెలియదు. ఎట్టకేలకు ఒంగోలులో బీజేపీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ హైకమాండ్ ఆదేశించడంతో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. బీఎల్ సంతోష్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు వచ్చారు. పార్టీలో పరిస్థితులపై ఆయనకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

బీఎల్ సంతోష్‌కు విష్ణువర్ధన్ రెడ్డి నివేదిక ?

ఏపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడ ఎయిర్ పోర్టుకు వచ్చిన బీఎల్ సంతోష్‌కు.. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అయితే బీఎల్ సంతోష్ ప్రత్యేకంగా విష్ణువర్దన్ రెడ్డితో అరగంట పాటు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు.. బీజేపీ కార్యక్రమాలు స్లో కావడం… వంటి అంశాలపై విష్ణువర్ధన్ రెడ్డి కొన్ని కీలక విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం.

పొత్తులపై చర్చ పెట్టుకోకుండా సొంత పోరాటం చేయాలన్నదే బీజేపీ విధానమా ?

జనసేనతో కలిసి వెళ్తామని.. టీడీపీతో పొత్తు గురించి హైకమాండ్ చెబుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియా ముందు చెబుతున్నారు. దీంతో గందరగోళం ఏర్పడుతోంది. జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది. ఏపీలో టీడీపీతో కలిసి వెళ్తున్నట్లుగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో గందరగోళం ఏర్పడింది.దీనిపై బీఎల్ సంతోష్ క్లారిటీ ఇస్తారని.. పొత్తులపై ఎలాంటి చర్చలు పెట్టుకోకుండా.. సొంతంగా బలపడాలని దిశానిర్దేశం చేస్తారని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.