రాజస్థాన్ – మహిళల భద్రత అంతంతమాత్రం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ఛత్తీసగఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగా, ఇంకా రాజస్థాన్, తెలంగాణ పోలింగ్ మిగిలి ఉంది. తెలంగాణలో నవంబరు 30న పోలింగ్ జరుగుతుండగా, రాజస్థాన్లో 25న ఓటింగ్ నిర్వహిస్తారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ జరిగేది కూడా రాజస్థాన్లోనేనని చెబుతున్న నేపథ్యంలో ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు ఇరు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. మహిళలంటే కాంగ్రెస్ కు గౌరవం లేదని ప్రచారం చేస్తున్న బీజేపీ, ఆ దిశగానే రాష్ట్రంలోని అధికార పార్టీ తప్పిదాలను తూర్పారపడుతోంది…

రాష్ట్రాన్ని కుదిపేసిన గ్యాంగ్ రేప్ ఘటన

2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా థనగాచీ అనే ప్రాంతంలో భర్త ఎదురుగానే మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిన వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారమైంది. ఎన్నికల సందర్భంగా ఇప్పుడదే చర్చనీయాంశమైంది. కన్హయ్య లాల్ శిరచ్ఛేదన, పేపర్ లీక్, అవినీతితో పాటు ఇప్పుడు బీజేపీ వారికి 2019 నుంచి ఇప్పటి వరకు మహిళలపై జరిగిన దౌర్జన్యాలు, అత్యాచారాలను ప్రస్తావిస్తున్నారు.మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటమే తమ ధ్యేయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెబుతున్నారు. పోలీసు శాఖలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని తద్వారా మహిళలకు భద్రత పెరుగుతుందని కూడా బీజేపీ వాదిస్తోంది.

మహిళలపై పెరుగుతున్న నేరాలు

రాజస్థాన్లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయన్నది వాస్తవం. జాతీయ క్రైమ్ బ్యూరో కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. భర్త ఎదుటే గ్యాంగ్ రేప్ వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్న గెహ్లాట్ సర్కారు.. విధిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లాంటి చర్యల ద్వారా అసలు అంశాన్ని పక్కతోవ పట్టించే ప్రయత్నంలో ఉంది. 2018లో అక్కడ మహిళలపై 27,866 నేరాలు జరిగాయి. 2021 నాటిక అది 41,550కి పెరిగింది. మహిళలపై నేరాల విషయంలో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. అందుకే మహిళలకు రాజస్థాన్ సురక్షితమైన రాష్ట్రం కాదని తాము వస్తే పరిస్తితిని మెరుగు పరుస్తామని బీజేపీ ప్రచారం చేస్తోంది.

శాంతి భద్రతలు లేకే ఇబ్బందులు

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించినందుకే మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వం సత్వర విచారణ జరుపుతున్నామని చెప్పడం కేవలం లెక్కల గారడీ మాత్రమేనని అంటోంది. కాంగ్రెస్ పార్టీ తాలిబన్ల తరహాలో వ్యవహరిస్తూ మహళలను అణచివేస్తోందని బీజేపీ వాదిస్తోంది. అధికారానికి వచ్చిన వెంటనే మహిళాభ్యుదయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ, అధికారంలోనూ వారికి పెద్ద పీట వేస్తామంటోంది. ఈ సందర్భంగా లోక్ సభ సభ్యురాలు దియా కుమారిని విద్యానగర్ అసెంబ్లీ స్తానం నుంచి పోటీ చేయించడాన్ని మనం మరిచిపోకూడదు.