కరెంట్ కావాలా, కాంగ్రెస్ కావాలా తేల్చుకోండని తెలంగాణ ఎన్నికల్లో కేటీఆర్ కొత్త నినాదాన్ని అందుకున్నారు. ఇప్పుడు కర్ణాటకలో అలాంటి నినాదమే వినిపించే అవకాశం ఉంది. నిజాయితీ కావాలా కాంగ్రెస్ కావాలా అని జనం ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చిందనుకోవాలి. ఎందుకంటే అధికారానికి వచ్చిందే తడవుగా కమిషన్లు, కరెప్షన్లు ప్రారంభించిన ముుఖ్యమంత్రి సిద్దరామయ్య టీమ్ ఇప్పుడు దాన్ని తారా స్థాయికి తీసుకెళ్లింది. చోద్యం ఏమిటంటే కర్ణాటక కాంగ్రెస్ అవినీతి ఇప్పుడు బహిరంగ రహస్యమైపోయింది.
సిద్ద కుమారుడి వీడియో లీక్
ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర మాట్లాడిన ఒక లఘు వీడియో ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో హల్ చల్ చేస్తోంది. బదలీలకు సంబంధించి అధికారులకు ఆయన ఫోన్ చేసి మాట్లాడిన 40 సెకన్ల వీడియో బయట పడటంతో సిద్దరామయ్య రాజీనామా చేయాలని జేడీఎస్ నేత కుమారస్వామి డిమాండ్ చేశారు. తాను ఐదుగురు పేర్లను మాత్రమే సిఫారసు చేశానని కొత్తవారిని ఎందుకు చేర్చారని వివేకానంద అనే అధికారిని యతీంద్ర నిలదీస్తున్నారు. కేవలం తాను చెప్పిన నలుగురైదుగురికే కీలక పదవులు ఇవ్వాలని ఇతరుల సంగతి పట్టించుకోవద్దని కూడా యతీంద్ర ఆ వీడియోలో హెచ్చరిస్తూ కనిపించారు. ఆ వీడియోలో ప్రస్తావించిన వివేకానంద.. మైసూరు రూరల్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని తెలుస్తోంది.
సిఫార్సు కాదంటున్న సిద్దరామయ్య…
కొందరు నేతలు ఆ వీడియోను వైరల్ చేసి దుష్ర్పచారానికి దిగే పనిలో ఉన్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రత్యారోపణ చేశారు. మైసూరులోని వరుణ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పాఠశాలల మరమ్మత్తుకు సంబంధించి మాత్రమే యతీంద్ర ఫోన్లో మాట్లాడారని సిద్ద చెప్పుకొచ్చారు. ఐదు అంటే ఐదుగురు అధికారులు కాదని, ఐదు పాఠశాలలని అర్థమట. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ పేరుతో బడులను అభివృద్ధి చేయాలన్న తపన యతీంద్రలో ఉందని ఆయన ఆ పనిచేస్తుంటే ఓర్వలేక విపక్షాలు లేని పోని ఆరోపణలకు దిగుతున్నాయని సిద్ద అంటున్నారు.
గతంలోనూ సీఎంఓపై ఆరోపణలు
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అనివార్యంగా ముఖ్యమంత్రిని వెనుకేసుకొచ్చారు.ఆశ్రయ సమితి చైర్మ పర్సన్ గా యతీంద్ర స్కూల్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే సిద్దరామయ్య అధికారానికి వచ్చిన నెల రోజుల్లోనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. బదలీలన్నీ సీఎంఓ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని విపక్షాలు విమర్శించాయి. ఏ బదలీకైనా ఒక రేటు పెట్టారని, అదీ సీఎంఓ అధికారులు చెబితేనే పనులు జరుగుతున్నాయని మాజీ సీఎం కుమారస్వామి అప్పట్లో చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో కూడా సీఎంఓ హ్యాండ్ ఉందని, 20 నుంచి 25 శాతం మార్జిన్ ఇస్తేనే నిధులు విడుదలవుతున్నాయని కూడా ఆరోపించారు. వాటిని మరిచిపోకముందే ఇప్పుడు నేరుగా సీఎం కుమారుడే మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. పైగా వివరణ ఇచ్చేందుకు యతీంద్ర ఇష్టపడకపోవడంతో మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి…..