విజయశాంతి అంటే… లేడీ సూపర్ స్టార్. ఆమె హీరోలతో పాటు రెమ్యూనరేషన్లు తీసుకుంటారని చెబుతారు. ప్రజా చైతన్యం ఉన్న సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్ననారు. సినిమాల్లో ఆమె రేంజ్ ను ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆమె పలుచనైపోయారు. అవకాశాల కోసం ఏ పార్టీకి గాలి ఉందనుకుంటే.. ఆ పార్టీ వైపు వెళ్లిపోవడంతో ఆమె గురించి ఎవరూ సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. తాజాగా బీజేపీకీ రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
అసలు బీజేపీలో ఎందుకు చేరారు ? ఎందుకు రాజీనామా చేశారు ?
విజయశాంతి తెలంగాణలో ఏ పార్టీ గాలి ఉందో చూసుకుని ఆ పార్టీలో చేరిపోతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని గమనించడం లేదు. 2018లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న విజయశాంతి .. పార్టీ ఓడిపోవడంతో… బీజేపీ పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తున్న సమయంలో ఆ పార్టీలో చేరిపోయారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. కానీ ఆమె పార్టీ కోసం చేసిన పనేమీ లేదు. పీఠం వేసి కూర్బోబెట్టి ఆమెకు సేవలు చేయాలన్నట్లుగా రాజకీయం చేశారు. సినిమాల్లో అయితే అలా చేస్తారు కానీ రాజకీయాల్లో మాత్రం ప్రజల కోసం పోరాడి సత్తా చూపించుకోవాల్సిందే. కానీ రాములమ్మ ఎప్పుడూ బయటకు వచ్చే ప్రయత్నమే చేయలేదు.
తనకంటూ ఓ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయిన విజయశాంతి
తెలంగాణ ఉద్యమకారిణినని చెప్పుకుని.. ఒసేయ్ రాములమ్మ సినిమాతో వచ్చిన క్రేజ్ ను అడ్డం పెట్టుకుని … మొదట తల్లితెలంగాణ పార్టీ పెట్టారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో కేసీఆర్ పంచన చేరిపోయారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. కానీ చివరికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ఆశపడి ఆ పార్టీలో చేరిపోయి.. ఓడిపోయారు. మెదక్ అసెంబ్లీకి పోటీ చేసిన తర్వాత మళ్లీ అటు వైపు చూడలేదు. దీంతో ఆమెకు నియోజకవర్గం అంటటూ లేకుండా పోయింది. 2018లో నియోజకవర్గం లేకపోవడంతో ఆమెకు కాంగ్రెస్ టిక్కెట్ కూడా ఇవ్వలేదు. అయినా తానో పెద్ద రాజకీయ నాయకురాలినని అనుకుంటూ ఉంటారు.
బీజేపీలో ఉండి రచ్చ చేయడమే తప్ప.. పార్టీ బలోపేతానికి చేసిందేమీ లేదు !
కీలక బాధ్యతలు అప్పగించాలంటే.. పని చేయాలి.. విజయశాంతి ఆ పని చేయరు అందుకే ఆమెకు రాష్ట్రంలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో తన సేవలను పార్టీ వినియోగించుకోవడం లేదని పలుమార్లు ట్వీట్ల రూపంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కానీ నేరుగా ఆమెకు ప్రధానిని కలిసేంత ప్రాధాన్యం బ ీజేపీ ఇచ్చింది. ఇటీవల ఎన్నికల ముందు ఆమెకు పోరాటాల కమిటీ చైర్మెన్ బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించింది. ఈ పని చేయడానికి ఆమె ముందుకు రాలేదు. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.
రాజకీయాల్లో నిలకడలేని తనంతో మొత్తం రాజకీయ భవిష్యత్ ను కామెడీ చేసుకున్న లీడర్ విజయశాంతినే అవుతారని ఆమె అభిమానులు మథనపడినా అది నిజమేని అందరూ అంగీకరించకతప్పదు.