గజ్వేల్‌లో ఏం జరుగుతోంది ? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతోంది. కేసీఆర్, ఈటల రాజేందర్ ముఖాముఖి పోరాడుతున్నారు. ఈటల నామినేషన్ కు వచ్చిన జనం చూసి.. బీజేపీ ఆషామాషీగా ఈటల పేరు ఖరారు చేయలేదని ఎవరికైనా అర్థమైపోయి ఉంటుంది. ఈటల రాజేందర్ సైలెంట్ గా చాపకింద నీరులా… బలపడుతున్నారు. బీఆర్ఎస్ లో అసంతృప్తి వర్గాలన్నీ ఈటలకు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో సైలెంట్ వేవ్ ప్రారంభమైనందన్న వాదన వినిపిస్తోంది.
గజ్వేల్‌లో పరిస్థితి బాగోలేకనే కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ !
తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయడంతో ఓటమి భయం కారణంగానే ఇలా చేస్తున్నారని ఎక్కువగా చర్చ జరుగుతోంది. పరిస్థితులు మాత్రం ఏకపక్షంగా లేవన్న అభిప్రాయం గజ్వేల్ లోనే వినిపిస్తోంది. ఈటల రాజేందర్ బరిలోకి దిగడానికి కేసీఆర్ పై ప్రజల్లో అసంతృప్తిని గుర్తించడమే కారణం . గజ్వేల్ లో చేసిన అభివృద్ధి కంటే.. ఆ పేరుతో నేతలు దోచుకున్నదే ఎక్కువ. పనులు చేయకుండా డబ్బులు సంపాదించిన నేతలు కళ్ల ముందు తిరుగుతూంటే ప్రజలకు తీవ్ర ఆగ్రహం రాకుండా ఉంటుందా ?
మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితుల ఆగ్రహమే కేసీఆర్‌కు శాపం
కేసీఆర్‌కు ప్రధాన సమస్యగా మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్య ఉంది. ఈ రెండు ప్రాంతాల పరిధిలో పది గ్రామపంచాయతీలల్లో 15 వేల మంది ఓటర్లున్నారు. వీరికి ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చినా, ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది. పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. పొలాలకు పరిహారం విషయంలో మాత్రం అసంతృప్తి నెలకొని ఉంది. పైగా భూసేకరణ సమయంలో తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనేక కోర్టు కేసులు పడ్డాయి. ఈ రైతుల్ని ప్రభుత్వం ఎక్కువగా వేధించింది. వీరు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేస్తారన్న అనుమానంతో వారికి మంత్రి హరీశ్‌రావు వారితో సమావేశమయ్యారు. కేసీఆర్‌ను గెలిపిస్తేనే మీ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయని గుర్తుంచుకోవాలని కోరారు. కానీ అక్కడి ఓటర్లు ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం.. మొదటి నుంచి ఈటలతో వారికి అనుబంధం ఉంది.
నామమాత్రంగా కాంగ్రెస్ అభ్యర్థి పోటీ
మరో వైపు బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరాటం కూడా సమస్యగా మారింది. గత రెండుసార్లు కేసీఆర్ పై పోటీ చేసి ఓడిపోయిన ప్రతాప్ రెడ్డి సహా మొత్తం నలుగురు ఐదుగురు కీలక నేతలు గజ్వేల్ పై పెత్తనం తమదేనని అనుకుంటున్నారు. ఎవరికి వారు వారి అనుచర వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వారు చేస్తున్న దందాలతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి నామమాత్రం కావడంతో ఈటల, కేసీఆర్ మధ్యనే పోటీ జరుగుతోంది. వచ్చే రెండు వారాల్లో బీజేపీ మరింత బలపడితే.. కేసీఆర్ కు రాజకీయ జీవితంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.