ఛింద్వారాలో హనుమంతుడి భక్తుడికి టెన్షన్

ఆయన మాజీ ముఖ్యమంత్రి. మాజీ కేంద్ర మంత్రి కూడా ఆయనే.బీజేపీ వారి కంటే ఎక్కువ హిందూత్వవాదినని చెప్పుకుంటారు. తాను హనుమంతుడి భక్తుడినని ఆంజనేయుడే తనను గెలిపిస్తాడని ధీమాగా ఉంటారు. అయనే కాంగ్రెస్ నేత కమల్ నాథ్. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఛింద్వారా ఎమ్మెల్యే ఆయన. తన జీవితంలో అత్యంత కీలక ఎన్నికను ఆయన ఎదుర్కొంటున్నారు.

ఛాలెంజ్ చేస్తున్న శివభక్తుడు

నవంబరు 17న మధ్యప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ సారి కూడా ఛింద్వారాలో కమల్ నాథ్ పోటీ చేస్తూ 2018 నాటి ప్రత్యర్థి వివేక్ బంటీ సాహు (బీజేపీ)ని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో బంటీపై ఆయన 25 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. అంతకముందు ఎన్నికలతో పోల్చితే ఆ మెజార్టీ చాలా తక్కువ కావడంతో ఈ సారి కమల్ నాథ్ ఓటమి ఖాయమని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఛింద్వారా జిల్లా భారతీయ జనతా యువ మోర్ఛా అధ్యక్షుడిగా పనిచేసిన బంటి.. రాజకీయాల్లో నిత్యం క్రియాశీలంగా ఉంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే కమల్ నాథ్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ చెబుతుండగా, మేము అసలు గెలవనిస్తే కదా అని బీజేపీ వాళ్లు అంటున్నారు.

మా ఎమ్మెల్యే కనిపించుటలేదు…

ఛింద్వారాలో బీజేపీ ఇప్పుడు కొత్త ప్రచారం మొదలు పెట్టింది. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని, నియోజకవర్గం నుంచి మాయమయ్యారని ప్రచారం చేస్తోంది. బ్యానర్లు కట్టింది, వాహనాలపై పోస్టరు అంటించింది. ఇందులో ద్విముఖ వ్యూహం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కమల్ నాథ్ ను ఛింద్వారా రప్పించడం ఒక వంతయితే, ఆయన్ను నియోజకవర్గానికి పరిమితం చేసి ఇతర చోట్ల తిరగకుండా చేయడం మరో వంతు అని చెబుతున్నారు. కమల్ నాథ్ కూడా మత అజెండా అమలు చేయాలని చూస్తున్నారు. రెండేళ్ల క్రితం తన నియోజకవర్గంలో 102 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి గుర్తు చేస్తూ తానే నిజమైన హిందూత్వవాదినని చెప్పుకుంటున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ఈ ఏడాది 84 అడుగుల శివుడి విగ్రహాన్ని ప్రతీష్ఠించారు. అక్కడే పూజ చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరో పక్క ధీరేంద్ర శాస్త్రి అనే వివాదాస్పద మత గురువును పిలిచి పూజలు చేయించడం ద్వారా కమల్ నాథ్ విమర్శల పాలయ్యారు.

ఉదయనిధి స్టాలిన్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్న బీజేపీ…

కమల్ నాథ్ హిందూత్వాన్ని ఎక్స్ పోజ్ చేసేందుకు బీజేపీ కూడా అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. నిజంగా హిందూత్వవాది అయితే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని విమర్శించినప్పుడు ఎందుకు మౌనం వహించారని కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. డీఎంకే కూడా ఇండియా గ్రూపులో భాగస్వామే కదా అని నిలదీశారు. ఛింద్వారాలో కమల్ నాథ్ ఓటమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు అక్కడ మోహరించారు. వారికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేస్తున్నారు. తొమ్మిది సార్లు ఛింద్వారాలో గెలిచిన కమల్ నాథ్ కోటను బద్దలు కొట్టాలని బీజేపీ తీర్మానించుకుంది.