కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కీలక నేత రాహుల్ గాంధీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. ఛత్తీస్ గఢ, మధ్యప్రదేశ్ కు తరచూ వచ్చి వెళ్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని తెలియడంతో అక్కడ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఐతే ఒక రాష్ట్రంపై మాత్రం ఆయన ఇంకా అంతగా ఫోకస్ పెట్టడం లేదు. అదే రాజస్థాన్ రాష్ట్రం
ఒక ర్యాలీ లేదు..
రాహుల్ గాంధీ రాజస్థాన్లో ఇంతవరకు ఒక ర్యాలీ నిర్వహించలేదు. నవంబరు 25న పోలింగ్ జరుగుతుండగా… స్టార్ క్యాంపైనర్ గా ఉన్న రాహుల్ గాంధీ ఎందుకు రాలేదన్న చర్చ జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వచ్చి వెళ్తున్నప్పటికీ రాహుల్ మాత్రం మొహం చూపించడం లేదు. దీపావళి తర్వాత రాహుల్ వస్తారని రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నా…ఇంతవరకు షెడ్యూల్ ఖరారు కాలేదు.సెప్టెంబరు 23న జరిగిన కార్యకర్తల సమ్మేళనానికి రాహుల్ హాజరైన తర్వాత మళ్లీ ఆయన రాజస్థాన్ వైపు చూడలేదు. ఇతర రాష్ట్రాల్లో ముందే ఎన్నికలున్నందున రాహుల్ రాజస్థాన్ వైపుకు రాలేకపోతున్నారని కాంగ్రెస్ నేతల వాదన.
రాజస్థాన్ నేతలను ఉత్తేజ పరచాలి..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రతీ ఎన్నికలో అధికార పార్టీ ఓడిపోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. దాన్ని రివర్స్ చేయడం అంత సులభం కాదని వారికి తెలిసిపోవడంతో కొంత టెన్షన్ పడుతున్న మాట వాస్తవం. రాహుల్ వస్తే బావుంటుందని వాళ్లు భావిస్తున్న తరుణంలో ప్రియాంకాగాంధీ కొంతమేర ఆ లోటును తీర్చినట్లుగా భావిస్తున్నారు. రాహుల్ రాక ఆలస్యం కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. గెహ్లాట్ – పైలట్ మధ్య వివాదంతో పార్టీ బాగా దెబ్బతిన్నదని రాహుల్ కు అర్థమైంది. దానితో వచ్చి చేసేది ఏముందన్న ఆలోచన ఆయనలో కలుగుతోంది. పైగా గెహ్లాట్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, పెద్దలకు చెప్పకుండానే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారని రాహుల్ దృష్టికి రావడం మరో సమస్యగా చెబుతున్నారు.
ర్యాలీలు ఫెయిల్ కావడంతో రాహుల్ కు టెన్షన్ ..
ఇటీవల నిర్వహించిన ఒకటి రెండు ర్యాలీలు పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రచారం సక్సెస్ ఫుల్ గా కనిపించడం లేదు. జనం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు, ఏదో తేడా కొడుతుందన్న అనుమానం రాహుల్ గాంధీ సహా సీనియర్ నాయకుల్లో కలుగుతోంది. పైగా గెహ్లాట్ ను వద్దనుకుంటే.. ఆయనే డామినేట్ చేస్తున్నారన్న అసంతృప్తి రాహుల్ లో కలుగుతోంది. గెహ్లాట్ తన వారందరికీ టికెట్ ఇప్పించుకున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఆయనకు తిరుగుండదన్న అనుమానం అధిష్టానంలో కలుగుతోంది. దానితో రాహుల్ దూరంగా ఉన్నారనిపిస్తోంది. అయితే ఈ నెల 15 నుంచి 23 మధ్య కాలంలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి….