టార్గెట్ లోక్ సభ – యడ్యూరప్ప తనయుడికి అధిష్టానం ఆదేశం

కర్ణాటక రాజకీయాలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ పోస్ట్ మార్టం ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసి పునరుజ్జీవం పొందే ప్రయత్నంలో ఉంది. మళ్లీ బలం పుంజుకునే దిశగా.. కొత్త వ్యూహాలతో ముందుకు నడుస్తోంది. ఈ దిశగానే మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చిన్న కుమారుడు విజయేంద్రకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. ఇంతవరకు అధ్యక్షుడిగా ఉన్న దక్షిణ కన్నడ ఎంపీ నలిన్ కుమార్ కటీల్ సమర్థంగా పనిచేయలేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని నిర్థారించుకుని ఆయన స్థానంలో విజయేంద్రను నియమించింది..

మూడు నాలుగు నెలలే టైమ్..

లోక్ సభ ఎన్నికలకు చాలా తక్కువ టైమ్ ఉంది. విజయేంద్ర ముందు పెద్ద బాధ్యతే ఉంది. రాష్ట్రంలోని 28 లోక్ సభా స్థానాలకు ఏకమొత్తంగా గెలుచుకునేందుకు ఆయన అహర్నిశలు పనిచేయాల్సిన అనివార్యత ఉంది.దక్షిణాదిన బీజేపీకి ఎక్కువ స్థానాలు కర్ణాటకలోనే వచ్చే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క స్థానం కూడా జారిపోకుండా చూస్తానని విజయేంద్ర ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి కర్ణాటకలో 25 స్థానాలున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వానికి వెన్నుదన్నుగా ఉంటానని చెబుతున్నారు.ఈ దిశగా ఆయన తండ్రి యడ్యూరప్ప మార్గదర్శనం కూడా పార్టీకి అవసరమని చెప్పేందుకు అధిష్టానం ప్రయత్నించింది.

లింగాయత్ సామాజిక వర్గాన్ని మంచి చేసుకునేందుకు…

2019లో యడ్యూరప్పను పదవి నుంచి దించేసిన తర్వాత లింగాయత్ సామాజికవర్గం చాలా కోపంగా ఉందని బీజేపీ చాలా ఆలస్యంగా గ్రహించింది. వారిలో ఆగ్రహాన్ని తగ్గించేందుకు లింగాయత్ వర్గానికే చెందిన విజయేంద్రకు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని చెబుతున్నారు. పైగా 2018లో విజయేంద్రకు ఆఖరి నిమిషంలో టికెట్ రద్దు చేయడంతో ఆయన అసంతృప్తి చెంది ఉన్నారు. దాన్ని తగ్గించేందుకు కూడా బీజేపీ పెద్దలు ఈ సారి పూర్తి బాధ్యతలు ఆయన చేతిలో పెట్టారు.

యూత్ లో మంచి ఫాలోయింగ్

విజయేంద్రకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలి ఎన్నికల్లో పాత మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ అభ్యర్థులను ఓడించడం వెనుక ఆయన వ్యూహం ఉందని చెబుతున్నారు. జన సమీకరణ, పార్టీ ప్రతిష్టను పెంచడం లాంటి అంశాల్లో తండ్రి యడ్యూరప్ప లక్షణాలను ఆయన పుణికి పుచ్చుకున్నారని పార్టీ వర్గాలు అంటుంటాయి. పార్టీ కోసం ఎంతటి త్యాగానికైనా ఆయన సిద్ధంగా ఉంటారని చెబుతారు. వారసత్వ రాజకీయాలు కాకుండా పార్టీలో కష్టపడి పైకి వచ్చిన నాయకుడు ఆయన. బీదర్ నుంచి చామరాజ్ నగర్ వరకు కేడర్లో ఆయనకు మంచి పేరు ఉంది. ప్రతీ ఒక్కరితో ఆయన కనెక్ట్ అయ్యారు. అందుకే అధిష్టానం బాగా ఆలోచించి ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించిందని చెబుతున్నారు.