జూబ్లిహిల్స్‌లో చతుర్ముఖ పోటీ – ఓట్ల చీలికలో బీజేపీ లాభపడబోతోందా ?

జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఈ సారి బీజేపీ దూకుడు కనిపిస్తోంది. టీడీపీలో చాలా కాలం ఉండి.. అక్కడ్నుంచి పోటీ చేయాలని అనుకున్న లంకల దీపక్ రెడ్డి నాలుగేళ్ల కిందట బీజేపీలో చేరి.. పార్టీని బలోపేతం చేసారు. ఇప్పుడు ఆయన అక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు. గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గంగా హైకమాండ్ గుర్తించడంతో ప్రచారానికి పెద్ద నేతల్ని పంపుతున్నారు.

మైనార్టీ ఓట్లలో చీలిక ఖాయం

హైదారాబాద్‌లో జూబ్లిహిల్స్ సీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అనూహ్య రీతిలో భారత మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దిన్ సీటు దక్కించుకున్నారు. కాంగ్రెస్ ప్రధానంగా ముస్లిం ఓట్లపై ఫోకస్ పెట్టింది. అందుకే పలు సర్వేలు, వ్యూహరచనల అనంతరం అజారుద్దిన్‌కు సీటిచ్చింది. ఇది బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కలసి రానుంది. ఆయన గట్టిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌ను మజ్లిస్ ప్రకటించింది. దీంతో బహుముఖ పోటీ నెలకొంది.

పేరుకే జూబ్లీహిల్స్ కానీ బస్తీలు ఎక్కువ

2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఆవిర్భవించిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో రహ్మత్‌నగర్‌, షేక్‌పేట, యూసు్‌ఫగూడ, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళ్‌రావునగర్‌ డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్లలో నలుగురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు. అయితే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పోటీలో నిలిచి రెండో స్థానం దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసిన మాగంటి గోపీనాథ్‌ 50,898 ఓట్లు సాధిస్తే.. ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నవీన్‌యాదవ్‌ చివరి రౌండ్‌ వరకు తీవ్ర పోటీనిచ్చి 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2018లో బీజేపీకి మద్దతుగా మజ్లిస్ నిలబడలేదు. దాంతో మాగంటి గోపీనాథ్ మరోసారి గెలిచారు. ఈ సారి ఎంఐఎం మైనార్టీ అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వడంతో బీఆర్ెస్ అభ్యర్థికి గండం తప్పేలా లేదు.

చతుర్మఖ పోటీ తప్పదా ?

2018 సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఎంఐఎం తాజాగా బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. మూడు పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధిస్తారోనని ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో అనుహ్యంగా ఎంఐఎం పార్టీ ఎన్నికల బరిలో నిలుస్తుండడంతో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఎంఐఎం పోటీతో ఏ పార్టీకి నష్టం.. ఏ పార్టీకి లాభం జరుగుతుందనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 3,75,430 ఓట్లు ఉండగా, ఇందులో 1.30 లక్షల వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. దీంతో ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారోనని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురికి అదనంగా ఎంఐఎం అభ్యర్థి కూడా రానుండడంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది. గతంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలకు మద్దతు పలికిన ఓటర్లు ఈసారి ఎవరి పక్షాన నిలుస్తారనేది చర్చనీయాంశమైంది.

పిట్టపోరు పిట్టపోరు దీపక్ రెడ్డి తీరుస్తారా ?

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా… గోపీనాథ్, మజ్లిస్ మధ్య వివాదంలో బీజేపీ అభ్యర్థి అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉండటంతో పాటు.. మైనార్టీ ఓట్లు చీలిపోతూండటంతో.. ఫలితం ఎలాగైనా రావొచ్చని అంచనా వేస్తున్నారు.