ఎంపీకే మన్ మే మోదీ – బీజేపీ విజయమంత్రం !

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుకపోతోంది. ఎక్కడ చూసినా బీజేపీ నేతలు, కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. విజయ దరహాసం చేసేందుకు ఎక్కువ సమయం లేదన్న ఫీలింగ్ వచ్చేస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కమలం పార్టీకి పూర్తి అడ్వాంటేజ్ ఉందని తాజాగా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సగటు ఓటర్లు బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారు..

జనంలోకి బాగా వెళ్లిన నినాదం

మోదీ కరిష్మాతో విజయం సాధించడం ఖాయమని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. అందుకే ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్లోగన్ ఉన్న ప్లకార్డు కనిపిస్తోంది…..ఎంపీకే మన్ మే మోదీ… అంటే మధ్యప్రదేశ్ (ఎంపీ) ప్రజల్లో ప్రతి ఒక్కరి మదిలో మోదీ ఉన్నారన్నది ఆ నినాదం సారాంశం. ఈ నినాదం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని బీజేపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమైనా ఉంటే.. అది మోదీ పరపతిలో కొట్టుకుపోతుందని విశ్వసిస్తున్నారు.

శివరాజ్ బాగానే పని చేశారు..ఐనా…

నిజానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాలన భేషుగ్గా ఉంది. అభివృద్ధికి నోచుకోని, మౌలిక వసతులు లేని మధ్యప్రదేశ్ ను ఆయన గాడిలో పెట్టారు. బీమారూ స్టేట్ నుంచి అన్ని వసతులున్న రాజ్యంగా మార్చారు. మహిళాభ్యుదయానికి ప్రత్యేక కృషి జరిపారు.ఇటీవలి కాలంలో లాడ్లీ బెహన్ యోజనలో ఇచ్చే సాయాన్ని పెంచారు. అయినా మూడు సార్లు అధికారంలో ఉన్న శివరాజ్ పట్ల ఏదైనా వ్యతిరేకత వస్తుందా అన్న కోణంలో బీజేపీ ఆలోచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారన్ని సైతం తిప్పుకొట్టేందుకు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. అందులో 2014…2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సారధ్యం వహించి ఘనవిజయం వైపుకు తీసుకెళ్లిన మోదీ పేరుతో మధ్యప్రదేశ్లో గెలవాలని బీజేపీ డిసైడైంది. ఆ దిశగానే ఎంపీకే మన్ మే మోదీ నినాదాన్ని నెత్తికెత్తుకుంది. మధ్యప్రదేశ్లో ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమల వెనుక మోదీ సలహాలు, సంప్రదింపులు ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.

మధ్యప్రదేశ్ అంటే ప్రత్యేక అభిమానం…

దేశంలోనే కాదు, మధ్యప్రదేశ్లో కూడా మోదీ చాలా పాపులర్ లీడర్. ప్రజల హృదయాల్లో ఆయన ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతాయి. 2014లో ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మోదీ 40 సార్లు మధ్యప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఎన్నికల పర్యటనలు కాకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వచ్చిన టూర్లు ఇవి. ఈ సారి ఎన్నికల ప్రకటనకు ముందు కూడా ఆయన గిరిజన సంక్షేమ కార్యక్రమాల కోసం మధ్యప్రదేశ్ వచ్చి వెళ్లారు. కొన్ని రోజులకే సంత్ రవిదాస్ ఆలయ శంకుస్థాపనకు వచ్చారు. ప్రజలకు కూడా మోదీ పట్ల అభిమానం ఉంది. అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక మాట అంటున్నారు. ఎంపీ కే మన్ మే మోదీ.. మోదీ కే మన్ మే ఎంపీ… అన్నది అమిత్ షా వాదన. మధ్యప్రదేశ్ నుంచి బీమారు స్టేట్ నుంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు…