రాజస్థాన్ ఎన్నికల్లో కుటుంబ కలహం

పదవి కుటుంబం, బంధుత్వం కంటే కూడా చాలా ఇంపార్టెంట్. రక్త సంబంధం కంటే రాజకీయ పదవి ముఖ్యమని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అందుకే అన్నపై తమ్ముడు, బావపై బావమరిది, తండ్రిపై కుమారుడు పోటీ చేస్తుంటారు. ఒకరే గెలుస్తారని, ఇతరులు ఓడిపోతారని తెలిసి కూడా బరిలో దిగుతారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది.

దంతా రాంఘర్ లో ఆసక్తికర పోరు..

నవంబరు 25న జరిగే ఎన్నికల్లో ఓ మహిళ తన మాజీ భర్తపై పోటీ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. రీతా సింఘాస్ అనే మహిళ.. హరియాణా కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ఈ సారి రాజస్థాన్లో కూడా పోటీ చేస్తున్న జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఆమె మాజీ భర్త వీరేంద్ర సింగ్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీసీసీ మాజీ అధ్యక్షుడు నారాయణ్ సింగ్ కుమారుడే వీరేంద్ర కావడం విశేషం. 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన రీటా.. ఈ సారి ఎన్నికల ముందు జేజేపీలో చేరారు. వీరేంద్ర సింగ్, రీతా మధ్య ఎవరు గెలుస్తారో చెప్పలేమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి….

ధోల్ పూర్లో వదిన మరిది పోటీ..

ధోల్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్తిగా శోభారాణి కుష్వాహ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున ఆమె మరిది శివ్ చరణ్ సింగ్ కుష్వాహా రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో శోభారాణి 20 వేల ఓట్ల మెజార్టీలో శివ చరణ్ సింగ్ పై గెలిచారు. అప్పుడు శోభారాణి బీజేపీలో, చరణ్ సింగ్ కాంగ్రెస్ లో ఉండేవారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినందుకు శోభారాణిని బీజేపీ నుంచి బహుష్కరించారు. తర్వాత ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి.. ఈ ఏడాది అక్టోబరులో ప్రియాంకాగాంధీ సమక్షంలో పార్టీలో చేరారు.

జాట్ కంచుకోటలో మామ, కోడలు

జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నాగౌర్ నియోజకవర్గంలో కూడా ఫ్యామిలీ ఫైట్ నడుస్తోంది. మీర్థా కుటుంబం రాజకీయ కలహం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారిన జ్యోతి మీర్థాకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. జ్యోతి వెళ్లిపోయిన తర్వాత ఆలోచించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆమె మామగారైన హరేంద్ర మీర్థాను ఎన్నికల బరిలోకి దించింది. ప్రజలతో మమేకమైన తనకే విజయావకాశాలున్నాయని జ్యోతి మీర్థా విశ్వసిస్తున్నారు. ఆర్ఎల్పీకి చెందిన హనుమాన్ బేనీవాల్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నందనే తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని జ్యోతి చెప్పుకుంటున్నారు. మరో సారి గెలిస్తే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య సహా అన్నింటినీ పరిష్కరిస్తానని జ్యోతి హామీ ఇస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి….