మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదలై విమర్శల ప్రశంసలు అందుకుంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీలో మొదట అనుకున్న నటులు వేరు..ఆ తర్వాత మారిన లెక్కలు వేరు. ఇంతకీ ముందుగా అనుకున్న నటులెవరంటే..
రెండు భాగాలుగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ మూవీ తమిళ ప్రేక్షకులను మెప్పించింది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీలో మొదట అనుకున్న నటులు వేరు..ఆ తర్వాత షూటింగ్ మొదలయ్యేసరికి వచ్చి చేరిన నటులు వేరు. అలా అనుకోకుండా వచ్చిన చేరినవారిలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష సహా ఇంకా చాలామంది అనుకున్నారు. విక్రమ్ ప్లేస్ లో ముందుగా కమలహాసన్ ని తీసుకోవాలనుకున్నాడట మణిరత్నం. ఈ మూవీ అసలు మహేష్ బాబు, విజయ్ తో చేద్దాం అనుకున్నాం అని గతంలో సుహాసిని స్వయంగా చెప్పింది. మరింత ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. ఈ మూవీ ప్లానింగ్ లో అస్సలు ఐశ్వర్యారాయ్ పేరు లేదట.
ఐశ్వర్యారాయ్ కాదు రేఖ
విక్రమ్ ను ప్రేమించి..ఆ తర్వాత శరత్ కుమార్ ని పెళ్లిచేసుకున్న పాత్రలో నటించింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కోసం ఐశ్వర్యారాయ్ బదులు ముందుగా రేఖని అనుకున్నాడట మణిరత్నం.అందానికి అందం, క్యారెక్టర్ కి తగ్గా ఎమోషన్స్ పలికించడంలో రేఖను మించి ఎవరుంటారని ఆలోచించారట. కానీ అనుకోకుండా రేఖ ప్లేస్ లోకి ఐశ్వర్యారాయ్ వచ్చి చేరింది. ఓరకంగా చెప్పాలంటే ఐశ్వర్యారాయ్ క్యారెక్టర్, అందం సినిమాకు హైలెట్ అయింది. అందం అంటే ఇలా కూడా ఉంటుందా అన్న రీతిలో తీర్చి దిద్దాడు మణిరత్నం. ఎక్కడా అసభ్యతకి తావు లేకుండా క్యారెక్టర్లో పూర్తిగా లీనమైపోయేలా ఉంటుంది నందిని పాత్ర. అందుకే ఆ క్యారెక్టర్లో మరొకరు కనిపిస్తే బావుండును అనే ఆలోచన ప్రేక్షకులకు రాలేదేమో..
కమల్ తో మణి
పొన్నియన్ సెల్వన్ తర్వాత ఇప్పుడు మణిరత్నం…కమల్ హాసన్ తో మూవీ తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో చివరిగా నాయకుడు మూవీ వచ్చింది. మళ్ళీ 35 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ థగ్ లైఫ్ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాని కమల్ హాసన్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ తో పాటు మణిరత్నం మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. మొత్తానికి పొన్నియన్ సెల్వన్ లో కమల్ ను మిస్సైన మణిరత్నం.. ఇప్పుడు కమల్ తో సన్షేషన్ క్రియేట్ చేసేందుకు వస్తున్నాడు. భారీ అంచనాల మధ్య వస్తోన్న ఈ మూవీతో మణిరత్నం ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి..