నితీశ్ కుమార్ అశ్లీల కామెంట్స్ పై దేశ వ్యాప్త నిరసన..

ఆయన్ను అందరూ సుశాసన్ బాబూ అంటారు. అంటే సుపరిపాలన అందించే నాయకుడు అని కావచ్చు. కాకపోతే అప్పుడప్పుడూ ఆయన దారి తప్పుతుంటారు. ఇష్టానుసారం మాట్లాడుతూ నవ్వులపాలవుతారు. ఈ సారి అంతకన్నా కాస్త మోతాదు పెంచి మహిళా విద్యపై అశ్లీల కామెంట్స్ చేశారు. పీకల్లోతు కష్టాల్లో ఇరుకున్నారు..

ఇతరులు వివరించలేని వ్యాఖ్యలు

బిహార్ అసెంబ్లీ సమావేశాల్లో ఓ అంశంపై చర్చ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. మహిళా విద్యకున్న ప్రాధాన్యాన్ని వివరించిన ఆయన బాగానే మాట్లాడుతున్నాననుకుని తప్పులో కాలేశారు. మహిళా విద్యతో జనాభా నియంత్రణ సాధ్యమన్న ఆయన సందేశం బాగానే ఉన్నా…ఆయన వివరించిన విధానమూ, ఆయన హావభావాలు అశ్లీలంగా ఉన్నాయి. చదువుకున్న మహిళలకు గర్భం దాల్చకుండా సెక్స్ లో పాల్గొనే తెలివి తేటలు ఉంటాయని ఆయన చెప్పబోయి..దానికి కాస్త ఎక్కువగానే అశ్లీలత జోడించారు. ఆ వ్యాఖ్యలను మరోకరు చెప్పడం కూడా కష్టమే…

విపక్షాలు, మహిళా సంఘాల నిరసన

నితీశ్ మాట్లాడిన గంటల్లోనే అదో పెద్ద వివాదమై కూర్చుంది.ఆయన మహిళలను కించపరిచారని కొందరు అంటే, గర్భనిరోధం కేవలం మహిళల బాధ్యతగా వర్ణించారని కొందరు మండిపడ్డారు. భారత రాజకీయాల్లో ఇంత వల్గర్ నాయకుడిని ఎన్నడూ చూడలేదని బీజేపీ ఆరోపించింది. బీ కేటగిరి సినిమాలు చూసి నితీశ్ బుర్ర చెడిపోయిందని కూడా వ్యాఖ్యానించింది.ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కొందరు అంటే.. అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. నితీశ్ కుమార్ మంచి వారేనని కొందరి పక్కన చేరి చెడిపోయారంటూ పరోక్షంగా ఆర్జేడీని కొందరు తప్పుపట్టారు. ఆయన రోడ్ సైడ్ లోఫర్ మాదిరిగా మాట్లాడారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యానించారు.నితీశ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది…

అర్థం చేసుకోవాలంటున్న తేజస్వీ యాదవ్..

బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాత్రం నితీశ్ ను వెనుకేసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. దేశంలో లైంగిక విద్య ఆవశ్యకతను చెప్పడమే నితీశ్ ఉద్దేశమని, జనాభా నియంత్రణకు ప్రాధాన్యమిస్తూ ఆయన మాట్లాడారని తేజస్వీ విశ్లేషించారు. అయితే నితీశ్ వ్యాఖ్యలపై దూమారం ఇప్పట్లో ఆగేలా లేదు. మహిళలను ఆయన లైంగిక వస్తువులుగా పరిగణిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అసలు మహిళా విద్యనే ఆయన అనుమానిస్తున్నారని కొందరు అంటున్నారు. అంత కష్టపడి చదువుకునేది ప్రెగ్నేన్సీ రాకుండా ఎలా ఉండాలో తెలుసుకునేందుకు మాత్రమేనా అని కొందరు నిలదీస్తున్నారు.నితీశ్ ఇప్పుడు క్షమాపణ కూడా చెప్పోచ్చు. లేదా నా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కూడా వివరించొచ్చు, కాకపోతే ఆయన మాట్లాడిన మాటలతో కలిగిన డేమేజ్ ను మాత్రం వెనక్కి తీసుకోవడం కష్టమే అవుతుంది.