మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా ఈ సారి ఎన్నికల్లో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. బీజేపీకి చెందిన సీనియర్ మంత్రులకు నిద్ర పట్టని పరిస్థితి ఎదురవుతోంది. ఎందుకంటే అక్కడ వారికి యువ బ్యాచ్ ఛాలెంజ్ విసురుతోంది. ఐనా బీజేపీ ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని మంత్రులు చెబుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న సాగర్ జిల్లా ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వచ్చిన సంగతిని వాళ్లు గుర్తు చేస్తున్నారు..
రెండు మూడు చోట్ల కాస్త టెన్షన్
శివరాజ్ సింగ్ కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా ఉన్న భూపేంద్ర సింగ్ ఈ సారి కూడా ఖూరియా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనపై రక్షా రాజ్ పుత్ అనే 29 ఏళ్ల మహిళ పోటీ చేస్తున్నారు. ఇక ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజాపనుల శాఖామంత్రి గోపాల్ భార్గవపై రహేలీ నియోజకవర్గంలో ఈ సారి జ్యోతి పటేల్ అనే 30 ఏళ్ల ఇంజనీర్ పోటీ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచారు. ఒకప్పుడు అధికార వర్గాలపై సమరశంఖం పూరించిన మహిళగా రక్షా రాజ్ పుట్ అక్కడి ప్రజలకు బాగానే తెలుసు. రాజకీయాల్లో గూండాగిరిని అడ్డుకునేందుకే తాను ఎంట్రీ ఇచ్చానని ఆమె చెబుతారు.
విక్టిమ్ కార్డ్ ఆడేందుకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రయత్నం
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వారంతా అధికార పార్టీ బాధితులమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని జ్యోతి పటేల్ చెప్పుకుంటున్నారు. తన తల్లి తండ్రీ ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉండేవారని వారిపై కూడా బీజేపీ కేసులు పెట్టిందని ప్రచారంలో ఆమె ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయితే స్వతంత్ర సంస్థలు జరిపిన సర్వేల్లో మాత్రం జ్యోతి పటేల్ తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని తెలిసింది. ఆమె మీద ఉన్న కేసులకు అధికార పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేలింది. జ్యోతి పటేల్ కుటుంబంపై ఉన్న ఒకటి రెండు కేసులు వ్యక్తిగత సమస్యలతో వచ్చినవేనని నిర్ధారించారు. యువతకు టికెట్లు ద్వారా ఒక సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినా బీజేపీ మంత్రులతో వారు సరితూగరని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ వృథా ప్రయాసకు దిగిందని సర్వేలు చెబుతున్నాయి.
సాగర్ లో బీజేపీకే ఛాన్స్
సాగర్ జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఖురాయ్, సుర్ఖీ, బీనా, దియోరీ, నర్యోలీ, సాగర్ సిటీ, బందా, రహేలీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. రెండు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ సారి తన బలాన్ని పెంచుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నేతలతో ఆరోపణలు చేయిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మంత్రులపై వచ్చిన ఆరోపణలన్నీ ఫేక్ ప్రచారాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గౌరవ్ సిరోథియా సమాధానమిస్తున్నారు. జనం ముందుకు వెళ్లి చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎలాంటి అంశాలు లేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నది బీజేపీ సమాధానం. పోలింగ్ రోజున ఏం జరుగుతుందో చూడాలి మరి..