పంచగంగ ఆలయం గురించి విన్నారా ఎప్పుడైనా!

మహారాష్ట్ర మహాబలేశ్వరం దగ్గర పశ్చిమ కనుమల్లో జన్మించిన కృష్ణమ్మకు పుట్టిన చోటే ఓ ఆలయం ఉంది. అదే కృష్ణాబాయి ఆలయం. 17-18 శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయంలో చూడచక్కని కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. కృష్ణాబాయి ఆలయానికి కిలోమీటరు దూరంలో ప్రసిద్ధి చెందిన పంచగంగ ఆలయం దర్శనమిస్తుంది. 4500 ఏళ్ల కిందటి ఈ కృష్ణుడి గుడిలో కృష్ణ, వేణీ, సావిత్రి, కొయనా, గాయత్రి నదులు కలుస్తాయని.. గోముఖంలోంచి వచ్చే ధార ఈ అయిదు నదులకూ ప్రతిరూపమని చెబుతారు. ఈ ఆలయంలో గోముఖి విగ్రహం, శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూడొచ్చు. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత మూలంగా ఏడాది పొడవునా భక్తులు సందర్శిస్తుంటారు.

పంచగంగ ప్రదేశం ఇదే
ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దంలో దేవగిరి యాదవ్ రాజు సింఘండియో నిర్మించారు. 16 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మరాఠా చక్రవర్తి శివాజీ మరింత మెరుగులు దిద్దారు. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేశారు. ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఐదు తూములు లాంటి రంధ్రాలుండగా ఇవి ఒకదానికి ఒకటి ఆరు అడుగుల దూరంలో ఉన్నాయి. ఈ నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ఐదు నదులు ఆలయానికి వెనుకవైపు ఉన్న కొండమీద నుంచి ప్రవహిస్తూ ఈ రంధ్రాల గుండా కాలువలోకి చేరి ఒకే నదిగా ప్రవహిస్తాయి. అదే కృష్ణానదిగా ప్రవహిస్తుంది. దీనినే పంచగంగ ప్రదేశం అంటారు. అక్కడి గోముఖం నుంచి జాలువారే నీటిధారను పవిత్రజలంగా భావించి భక్తులు తలపై చల్లుకుంటారు. అక్కడి నుంచి కొంచెం దిగువకు వెళ్తే ఆలయాల కేంద్రంగా పేరుగాంచిన మహాబలేశ్వరం వస్తుంది. ఆ ప్రాంతాన్ని ‘వై’ అనీ, ‘వాయి’ అనీ పిలుస్తారు. వాయిలో దొడ్డ గణపతి మహాబలేశ్వరం తర్వాత కృష్ణమ్మ వాయి పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఈ మందిరం నుండి బయటికి రాగానే అక్కడ మనకి మహాబలేశ్వరుని ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పంచగంగని చూసి తరిస్తారు.

నిత్యం ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు . మొత్తం ఆలయాన్ని చూడటానికి గంట సమయం పడుతుంది. అక్టోబర్ నుంచి జూన్ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. పర్యాటకులు మహాబలేశ్వర్ నుంచి టాక్సీలను ఆలయానికి చేరుకోవచ్చు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.