బీజేపీ బీసీ నినాదంపై ఆన్సర్ లేని కాంగ్రెస్ , బీఆర్ఎస్ – లెక్క మారుతోంది !

తెలంగాణ బీజేపీ తాము గెలిస్తే బీసీని సీఎం ను చేస్తామని ప్రకటించింది. ఆ బీసీ నేత ఎవరు అన్నది ప్రకటించినా .. ప్రకటించకపోయినా ఇతర పార్టీల నేతలు మత్రం బీసీ సీఎం నినాదంపై వీలైనంత వరకూ మౌనం పాటించే వ్యూహంలోనే ఉన్నాయి. ఎక్కువ స్పందిస్తే తమ పార్టీలో కూడా బీసీ ఉద్యమం వస్తుందని .. అదే జరిగితే బీజేపీకి మేలు చేసినట్లవుతుందన్న ఉద్దేశంతో ఆగిపోతున్నారు. అయితే ఎక్కువ కాలం ఈ పరిస్థితి ఉండదని… ప్రధాని మోదీ సభ తర్వాత రాజకీయం మారిపోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్‌లో కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రం సీఎం పోస్టు రిజర్వ్

తెలంగాణ వస్తే దళితుడే సీఎం కేసీఆర్ .. దళితుల్ని ఎంతగా మోసం చేశారో ఇంకా కళ్ల ముందే ఉంది. ఆ పార్టీ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉంటుంది. ఆ కుటుంబం చేతి నుంచి పార్టీ జారిపోయే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అయ్యేది వారే. ఇప్పుడు ఎన్నికల్లో గెలిస్తే కేసీఆర్ సీఎం అవుతారు. తర్వాత కేటీఆర్ అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. అంతే కానీ.. బీఆర్ఎస్‌లో మరో నేత ముఖ్యంగా బీసీ నేత సీఎం అయ్యే అవకాశాలే లేవు. అందుకే బీసీ సీఎం నినాదాన్ని బీఆర్ఎస్ అంత సీరియస్ గా తీసుకోలేదు. తీసుకునే చాన్స్ కూడా లేదు. అందుకే బీజేపీ బీసీ నినాదం ఆ పార్టీని వణికిస్తోంది.

కాంగ్రెస్ లో ప్రముఖ బీసీ నేత ఎవరున్నారు ? ఎదగనివ్వలేదుగా !

కాంగ్రెస్‌లో ప్రముఖ బీసీ నేతలంటూ ఎవరూ లేరు. ఉన్నదంతా రెడ్డి సామాజికవర్గం నేతలే. ఎవరైనా ఎదుగుతున్నారంటే తొక్కేస్తారు. తొలి తెలంగాణ పీసీసీ చీఫ్ గా పొన్నాల ఉంటే… రెడ్డి నేతలు నానా తిప్పలు పెట్టి పంపిచేశారు. మళ్లీ ఆయనను కోలుకోనివ్వలేదు. చివరికి అవమానాలతో పార్టీ మారిపోవాల్సి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరూ బీసీ సీఎం గురించి మాట్లాడటం లేదు. ఉన్న పరిస్థితుల్లో.. ఆ పార్టీ గెలిస్తే.. రెడ్డి సామాజికవర్గ నేతలే సీఎం పదవి కోసం పోటీ పడతారు. ఈటల, బండి సంజయ్ తరహాలో కాంగ్రెస్ లో బలమైన బీసీ నేత లేరు. అదే సమయంలో.. రెడ్డి వర్గం కాదనుకుంటే.. దళిత వర్గాల నుంచి భట్టి విక్రమార్క రేసులో ఉంటారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ పెద్దగా బీసీ సీఎం నినాదంపై కల్పించుకోవడం లేదు.

రెండు పార్టీల నిస్సహాయత బీజేపీకి ప్లస్ పాయింట్

బీసీ సీఎం నినాదం విషయంలో రెండు పార్టీలు కౌంటర్ ఇవ్వలేకపోవడంతో బీజేపీ దూకుడు పెంచుతోంది. ప్రధానితో ఆత్మగౌరవ సభను నిర్వహింప చేస్తున్నారు. రెడు పార్టీలు బీసీలకు వ్యతిరేకమని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణళికలు సిద్ధం చేసుకున్నారు. బీసీ సీఎం నినాదంతో వెళ్తే.. తమకు తిరుగు ఉండదన్న నమ్మకంతో ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆత్మరక్షణ ధోరణి బీజేపీకి ఓ అవకాశం కల్పిస్తోందని అనుకోవచ్చు.