ఏపీలో ఇంకెన్నాళ్లు ఈ పగ- ప్రతీకారాల పాలనలు – ప్రజల్లో మార్పు రాబోతోందా ?

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది పరిపాలన కాదు.. పగ, ప్రతీకారాలు తీర్చుకోవడం అని గత తొమ్మిదిన్నరేళ్లుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అందరికీ అర్థమైపోతుంది. రాజకీయ పార్టీలు చేసే మాయా రాజకీయంలో ప్రజలు ఇప్పటి వరకూ నిజాలు తెలుసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు వారికి ఇప్పుడు పరిస్థితులు అర్థం అవుతున్నాయి. టీడీపీ, వైసీపీ చేస్తున్న కక్ష పూరిత రాజకీయాల్లో అంతిమంగా తమకే నష్టం జరుగుతోందని అంచనాకు వస్తున్నారు. అందుకే వారంతా మూడో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. ప్రజలకు ఈ విషయాలను చెప్పి… తామే ప్రత్యామ్నాయం అని నమ్మకం కలిగించేందుకు రంగంలోకి దిగుతున్నారు.

ఇంకెన్నాళ్లు కేసులు, కోర్టులు, బెయిళ్ల పాలన

కోర్టులు , కేసులు, బెయిళ్ల పేరుతో తొమ్మిదిన్నరేళ్లు గడిపోయింది. విభజన ఆంధ్రప్రదేశ్ ను అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం వచ్చినా పూర్తిగా నేలమట్టం చేశాయి ప్రాంతీయ పార్టీలు. రెండు పార్టీలకు ప్రజలు చెరో అవకాశం ఇచ్చారు. అయినా ఎవరికి వారు అవినీతి, పగ, ప్రతీకారాల కోసమే సమయం, పాలన వెచ్చించారు. ఇదే విషయాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కూడా బిజెపి డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి కోసం బిజెపి కూడా ఒకసారి అవకాశం ఇవ్వమని రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. సత్య సాయి జిల్లా బిజెపి బూత్ అధ్యక్షులు, శక్తీ కేంద్ర ప్రముఖులతో ఎన్నికల సన్నాహాలపై విష్ణువర్ధన్ రెడ్డి చర్చించారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో ముందుకు !

తెలంగాణలో బీసీ సీఎం నివాదంతో వెళ్తున్న బీజేపీ… ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో త్వరలో భారీ ప్రచార ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. రెండు ప్రాంతీయ పార్టీల అవినీతి, అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయి వ్యూహంతో బరిలోకి దిగనుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు.. పాలన పూర్తిగా ప్రజల కోసమే ఉంటుందని .. పగ, ప్రతీకారాల కోసం అధికారం దుర్వినియోగం చేయడమనే మాటే ఉండదని హామీ ఇవ్వబోతున్నారు.

ఏపీలో రాబోయేది ఎన్డీఏ సర్కారే

తెలంగాణలో ఎన్డీఏ సర్కార్ రాబోతోందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. హంగ్ వచ్చినా… అతిపెద్ద పార్టీగా బీజేపీ, జనసేన కూటమి నిలిచే అవకాశం ఉంది. ఏపీలోనూ ఆ కూటమే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ప్రజలు బీజేపీ, జనసేన కూటమిని స్వాగతిస్తే… ఇక తిరుగు ఉండదు. అందుకే.. తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.