మహారాష్ట్ర అధికార కూటమికి ప్రజా మద్దతు

మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వర్గం అధికార కూటమిలో చేరినప్పుడు అనేక అనుమానాలు తలెత్తాయి. అజిత్ ఎక్కువ కాలం మహాయుతి కూటమిలో ఉండలేరని కొందరు అంటే, అది అనైతిక పొత్తు అని ప్రజలు దాన్ని విశ్వసించరని మరికొందరు ఆరోపించారు. అయితే ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్ ఎన్పీపీ కూటమిని జనం ఆమోదిస్తున్నారని వరుస సంఘటనలు నిరూపిస్తున్నాయి..

పంచాయతీ ఎన్నికల్లో విజయభేరీ..

మహారాష్ట్ర అధికార కూటమిలో ఇప్పుడు ఎక్కడ లేదని ఆనందం కనిపిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ కూటమికి ఘనవిజయం సాధ్యమైంది. 2,359 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగితే అందులో 1,350 పంచాయతీలను కూటమి కైవసం చేసుకుంది. ఈ క్రమంలో శరద్ పవార్ ఎన్సీపీ బాగా దెబ్బతిన్నది. ఆయన వర్గం కేవలం 178 గ్రామ పంచాయతీల్లో గెలిస్తే అజిత్ పవార్ ఫ్యాక్షన్ 371 చోట్ల ఘనవిజయం సాధించింది.

తిరుగులేని బీజేపీ , బీఆర్ఎస్ బోణీ

ఇప్పుడు పరిమితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మహారాష్ట్రలో తిరుగులేదని తేలిపోయింది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ఆ పార్టీకి ఏకంగా 743 పంచాయతీలు దక్కాయి. ఏక్ నాథ్ షిండే శివసేనకు 240 పంచాయతీలు వచ్చాయి. ఇక్కడ మరో కోణం కూడా ఆవిష్కృతమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ 53 గ్రామ పంచాయతీల్లో పాగా వేసింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేసీఆర్ ఇతర నేతలు మహారాష్ట్ర వైపు కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి వచ్చిందని అయినా మహారాష్ట్ర ప్రజలు తమకు మద్దతిచ్చారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదీ తమకు శుభ పరిణామమని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి మహారాష్ట్రలో అధికారం దిశగా పయనిస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ముుంబై వెలుపల షిండే బలం…

ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బలం కేవలం ముంబై దాని చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే పరిమితమని భావించారు. ఆ ఆలోచన తప్పు అని ఇప్పుడిప్పుడే నిరూపితమవుతోంది. సంప్రదాయంగా శివసేనకు బలం లేని ప్రాంతాలకు కూడా షిండే గ్రూపు విస్తరిస్తోందని తాజాగా విడుదలైన పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి. ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరాఠా కోటా వ్యవహారాన్ని వారికి సానుకూలంగా పరిష్కరిస్తామని షిండే ఇచ్చిన హామీ గ్రామీణ ప్రజలపై బాగానే పనిచేసిందని చెప్పాలి. కోటా ఉద్యమకారులు ఆమరణ దీక్షను విరమించుకోవడం కూడా కలిసొచ్చే అంశంగా చెప్పాలి. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి మరాఠా కోటా విషయంలో సహేతుకమైన నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసమూ జనంలో కలుగుతోంది. అందుకే ప్రస్తుతానికి ఉద్యమం ఆగిపోయి, మహారాష్ట్రలో శాంతియుత పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పాలి.