తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమయింది. 10వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 5వ ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు తీసుకోరు. ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వస్తే వారికి స్లిప్‌లు ఇచ్చి అందరూ నామినేషన్లు వేసే అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మంచి రోజులు ఉన్నాయి. ఈ మూడు రోజుల్లోనే ఎక్కువ సంఖ్యలో నామినేషన్లన్లు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు.
నామినేషన్ వేయాలంటే కొన్ని రూల్స్
రాష్ట్రంలో ఎక్కడ ఓటు ఉన్నా అభ్యర్థిగా పోటీ చేయవచ్చు. అయితే ఆయనను బలపరిచే వారు మాత్రం స్థానిక నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ సారి ఈ నామినేషన్లలో మార్పులు చేసింది. అఫిడవిట్‌ను అసంపూర్తిగా నింపి ఇస్తే దానికి ఆర్‌వో నోటీసులు జారీ చేస్తారు. అభ్యర్థి దానిని సవరించాల్సిందిగా సూచిస్తారు. అప్పటికీ అభ్యర్థి స్పందించకుంటే నామినేషన్‌ను తిరస్కరించే అధికారం ఆర్‌వోకు ఉన్నది. నామినేషన్ దాఖలు చేయడానికి జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు ధరావత్తు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఓట్లు తెచ్చుకుంటే డిపాజిట్ తిరిగి ఇస్తారు.
బీసీ నినాదంతో రాజకీయాల్ని మార్చేసిన బీజేపీ
బీసీ నినాదంతో భారతీయ జనతాపార్టీ రాజకీయాల్ని మార్చేసింది. జనసేన పార్టీ పొత్తు కలవడంతో మున్నూరు కాపు సామాజికవర్గం అంతా బీజేపీ కూటమి వైపు నిలిచే అవకాసం ఉంది. ప్రధాని మోదీ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనననున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ బీసీ లకు సీఎం పదవి రాదని చెప్పనున్నారు. తెలంగాణలో అరవై శాతానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ తో బీజేపీ రంగంలోకి దిగడంతో రాజకీయం మారిపోయింది. ఇతర పార్టీలు ఈ అంశాన్ని చర్చల్లోకి రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ బీసీ సీఎం నినాదం ప్రజల్లోకి వెళ్లిపోయింది.
ప్రచారం ప్రారంభించిన పార్టీలు
ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. అయితే అన్ని పార్టీలు నామినేషన్ల గడువు వచ్చేసినప్పటికీ కొన్ని సీట్లు పెండింగ్ లో పెట్టాయి. ఒకటి , రెండు రోజుల్లో అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసి.. బీఫాంలు ఇవ్వనున్నాయి టికెట్ రాని అభ్యర్థుల బుజ్జగింపులతోపాటు పొత్తుల్లోని పార్టీలతో చర్చలను.. వీలైనంత త్వరగా ముగించాలని డిసైడ్ అయ్యాయి. ఇతర చిన్న పార్టీలు పోటీ చేస్తాయా లేదా అన్న సంగతి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. టీడీపీ చేతులెత్తేసింది. షర్మిల పార్టీ.. ఒకటి, రెండు చోట్ల పోటీ చేయడం గగనంగా మారింది. బీఎస్పీ మాత్రం… ప్రవీణ్ కుమార్ పట్టుబట్టి పోరాడుతున్నారు. కానీ ఆయన పోటీ చేస్తున్న సిర్పూర్‌లోనే కాస్త పోటీ ఇచ్చే చాన్స్ ఉంది.