రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట

అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కాక తారాస్థాయికి చేరింది. ఒక్కో జాబితా బయటకు వచ్చే తరుణంలో టికెట్ రాని ఆశావహులు రెచ్చిపోతున్నారు. అధిష్టానంపైనా, పార్టీ రాష్ట్ర నేతలపైనా తిట్ల దండకం అందుకున్నారు. టికెట్ రాదని తెలిసిన వారు సైతం నానా యాగీ చేసే ప్రయత్నంలో ఉన్నారు…

రెండో సారి గెలిచేందుకు తంటాలు

రాజస్థాన్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వరుసగా రెండో సారి అధికారానికి రాదని గత నాలుగైదు ఎన్నికలు తేల్చేశాయి. ఈ సారి ఆ రికార్డును బద్దలు కొట్టి వరుసగా రెండో సారి సీఎం కుర్చీపై కూర్చోవాలని అశోక్ గెహ్లాట్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గెలుపు గుర్రాల పేరుతో కొందరికి టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని తేల్చేశారు. అదే ఇప్పుడు రెబెల్స్ ఆగ్రహానికి కారణమవుతోంది. పార్టీ అభ్యర్థుల ఐదో జాబితా వెల్లడి కావడంతో బుధవారం రాజధాని జైపూర్ నుంచి మారుమూల వరకు కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలియజేశాయి. తమ నాయకుడికి టికెట్ రాలేదని తెలిసిన ఆయా నేతల అనుచరులు వీధి పోరాటాలకు దిగారు.జెండాలు కిందపడేసి, పార్టీ బ్యానర్లు చించేసి పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు…

సోనియా, రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు

ప్రతీ ఒక్కరినీ సంతృప్తి పరచలేమన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్టేట్ మెంట్ టికెట్ దక్కని వారికి కోపం తెప్పించింది. పార్టీ గెలిచిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని గెహ్లాట్ హామీ పలికినా వినేందుకు వాళ్లు సిద్ధంగా లేరు. గెహ్లాట్ పై దుమ్మెత్తిపోస్తున్న కొందరు రెబెల్స్ .. పనిలో పనిగా పార్టీ అధిష్టానంపై కూడా ఆరోపణలు సంధిస్తున్నారు. సోనియా, రాహుల్ మద్దతుతోనే గెహ్లాట్ రెచ్చిపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు. పైగా ఒకప్పుడు హైకమాండ్ కు ఎదురు తిరిగిన మంత్రులకు మళ్లీ టికెట్లిస్తూ, అంకితభావంతో క్రమశిక్షణగా ఉన్న వారికి టికెట్లు ఇవ్వలేదని ఆరోపించి కొందరు పార్టీ ఫ్లెక్సీలను సైతం తగులబెట్టారు.. హవా మహల్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మహేష్ జోషి వ్యవహారం వింతగా ఉంది.ఆ నియోజకవర్గం అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోయినా టికెట్ రాదన్న అనుమానంతో ఆయన అనుచరులు నిరసనలకు దిగుతున్నారు. జోషి కుమారుడిపై రేప్ కేసు ఉండటంతో ఇటీవలే ఆయనకు పార్టీ షో కాజ్ నోటీసు ఇచ్చింది. ఇక తన పని అయిపోయిందనుకుని జోషి తన అనుచరులను రెచ్చగొడుతున్నట్లు అనుమానం…

తీరని గెహ్లాట్, పైలట్ వివాదం…

చాలా కాలంగా నలుగుతున్న అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వివాదం కూడా టికెట్ల బట్వాడాపై ప్రభావం చూపుతోంది. సచిన్ వర్గానికి టికెట్లు రాకుండా చూసేందుకు గెహ్లాట్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దాన్ని దాటుకుని తన వర్గానికి న్యాయం చేయించుకునేందుకు సచిన్ పావులు కదుపుతున్నారు. ఈ సంఘర్షణ వల్ల కూడా నిరసనలు తప్పడం లేదని చెబుతున్నారు. మరో పక్క ఈ సారి రాజస్థాన్లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్లో కాంగ్రెస్ అసలు గెలవని 54 సీట్లున్నాయి. ఇక మిగిలిన 146 స్థానాల్లో కాంగ్రెస్ సింపుల్ మెజార్టీ అయిన 101 స్థానాల్లో గెలవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గరిష్టంగా 99 సీట్లు వచ్చాయి. ఆ లెక్కన చూసుకుంటే ఈ సారి కూడా కష్టకాలమేనంటున్నారు…