అయ్యప్ప మాల వేసుకున్నవారంతా 41 రోజుల పాటూ ఎన్నో నియమాలు పాటిస్తారు. నేలమీద పడుకోవడం, చన్నీటి స్నానం, ఏకభుక్తం, పాదరక్షలు ధరించకపోవడం..ఇలా చాలా నియమాలుంటాయి. అయితే ఇవన్నీ దేవుడి కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే..దీనివెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..
కార్తీకమాసం మొదలు మకరసంక్రాంతి వరకూ ఎక్కడ చూసినా శరణు ఘోష వినిపిస్తుంటుంది. ఎటు చూసినా అయ్యప్ప మాలధారులే కనిపిస్తారు. 41 రోజుల పాటూ అత్యంత నియమ నిష్టలతో దీక్ష చేస్తారు. మండల దీక్ష పూర్తయ్యే వరకూ ఎన్నో కఠిన నియమాలు పాటిస్తారు. ఇలా అనుసరించే ప్రతి నియమం వెనుకా ఆరోగ్య రహస్యాలున్నాయి…
@ నేలపై నిద్రపోవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది, కండరాలు పటిష్టంగా ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
@ తెల్లవారు జామునే నిద్రలేవడం చైతన్యానికి ప్రతీక
@ సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది
@ స్నానానంతరం దీపారాధన కాంతి ఆవరణ మొత్తాన్ని ఆధ్యాత్మికంగా మార్చేస్తుంది. శ్రద్ధగా పూజ చేయడం వల్ల మనసు తేలికపడుతుంది.
@ సామూహికంగా కలిసి ఉండటం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది
@ నిత్యం రెండు పూటలా దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రమైన దుస్తులు ధరించడం అలవాటవుతుంది
@ అధిక ప్రసంగాలకు, వివాదాలకు దూరంగా ఉండటం వల్ల సమయం వృధా కాదు..ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది
@ ఒక్కపూట భోజనం చేయడం వల్ల మితాహారం…ముఖ్యంగా శాఖాహారం అలవాటు అవుతుంది
@ పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది
@ అయ్యప్ప మాల సాధారణంగా శీతాకాలంలో వేస్తారు.. ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వేడినిస్తాయి
@ దీక్షలో భాగంగా అయ్యప్ప మాలధారులు మాలలు ధరిస్తారు. రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు, తామర పూసల మాలలు వేసుకుంటారు. ఈ మాలలు శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తాయి.
@ కనుబొమ్మల మధ్య భాగంలో “సుషుమ్న” అనే నాడి ఉంటుంది. ఈ నాడి జ్ఞానాన్నిస్తుంది..ఆ ప్రదేశంలో గంధం, కుంకుమ ఆ నాడిని ఉత్తేజపరుస్తుంది
@ జీవులన్నిటిలోను దేవుడున్నాడనే భావంతోనే జీవులన్నిటిని “స్వామి” అని పిలవాలని అయ్యప్ప దీక్షలో నియమాన్ని విధించారు. అందుకే అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు అందరినీ “స్వామి” అనే పిలుస్తారు.
శరీరాన్ని, మనసుని అదుపులో ఉంచుకుని సన్మార్గంలో నడిపించేదే అయ్యప్ప మండల దీక్ష. 41 రోజుల పాటు మనసుని ఒకే విషయంపై లగ్నం చేయడమే ఈ దీక్షలో పరమార్థం.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.