మధ్యప్రదేశ్ – ఎటు చూసినా బీజేపీ పైచేయి

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మధ్యప్రదేశ్ లో ఈ నెల 17న పోలింగ్ జరుగనుండగా, ఎక్కువ మంది ఓటర్లు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అటు నోటిమాటగానూ, ఇటు గణాంకాల పరంగానూ బీజేపీ గెలుపు ఖాయమని తేలిపోతోంది.కాంగ్రెస్ పార్టీకి చెందిన కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ లాంటి వారు ఎంత ప్రయత్నించినా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వాన్ని కొట్టడం అసాధ్యమని తేలిపోయింది..

2003 నుంచి బీజేపీ ఆధిపత్యం..

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి మధ్యప్రదేశ్లో బీజేపీదే పైచేయిగా కనిపిస్తోంది. గత నాలుగు ఎన్నికల్లోనూ బీజేపీకి ఆధిపత్యం కనిపించింది. 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి 173 స్థానాలు రాగా, కాంగ్రెస్ కేవలం 38 సీట్లతో సరిపెట్టుకుంది. అప్పటి నుంచి బీజేపీకి తిరుగులేదనే చెప్పాలి. 2008లో బీజేపీకి 143 స్థానాలు వస్తే కాంగ్రెస్ 71 చోట్ల గెలిచింది. 2013 నాటికి బీజేపీ బలం కాస్త పెరిగి కాంగ్రెస్ పార్టీకి తగ్గింది. అప్పుడు బీజేపీకి 165 స్థానాలు దక్కితే కాంగ్రెస్ బలం 71 నుంచి 58కి తగ్గింది. ఇక 2018లో మాత్రం పరిస్థితులు మారాయి. ఏ పార్టీకి మెజార్టీ రాక హంగ్ ఏర్పడింది. అప్పుడు బీజేపీకి 109 స్థానాలు దక్కితే, కాంగ్రెస్ 114కు చేరుకుని అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాలు తిరగకుండానే కాంగ్రెస్ లో తిరుగుబాటు వచ్చి జ్యోతిరాదిత్య సింథియా వర్గం బీజేపీలో చేరిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఓట్ షేర్లోనూ పైచేయి

నిజానికి 2018లో బీజేపీకి సీట్లు తగ్గినా కాంగ్రెస్ కంటే ఓట్ షేర్ ఎక్కువగా ఉంది. బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ కు కాస్త తక్కువగా 40 శాతం ఓట్లు వచ్చాయి. ఏ ఎన్నిక చూసినా బీజేపీ ఓట్ షేర్ ఎక్కువగానే ఉంది. 37 శాతం నుంచి 44 శాతం వరకు ఓట్లు ఆ పార్టీ సాధిస్తూ వచ్చింది. వరుసగా నాలుగు ఎన్నికల స్థితిగతులు చూస్తే ఈ సారి కూడా బీజేపీ విజయం ఖాయమనిపిస్తోంది..

మెజార్టీ సామాజిక వర్గాలు బీజేపీ వైపు..

తాజాగా జరిగిన ఒక సర్వే ప్రకారం సామాజిక వర్గాల లెక్కల్లోనూ బీజేపీ ఈ సారి ముందు వరుసలో ఉంది.బ్రాహ్మణ, బనియా, రాజ్ పుట్ సామాజిక వర్గాలు బీజేపీ వైపు ఉన్నట్లు తేలింది. బ్రాహ్మణుల్లో 80శాతం మంది బీజేపీ వైపు ఉంటే. 12 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ ను సమర్థిస్తున్నారు. బనియా సామాజికవర్గంలో 68 శాతం మంది బీజేపీని సమర్థిస్తున్నారు. కాంగ్రెస్ కు 14 శాతం మద్దతు ఉంది. రాజ్ పుట్స్ లో 72 శాతం మంది బీజేపీకి ఓటెస్తామంటున్నారు. 12 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ వైపున ఉన్నారు. కుర్మీలు, యాదవుల్లో కూడా 50 శాతం మంది బీజేపీకి జై కొడుతున్నారు. ఓబీసీల్లో 56 శాతం మంది బీజేపీకి మద్దతిస్తున్నారు. 32 శాతం మంది కాంగ్రెస్ వైపున ఉన్నారు. దళితుల ఓట్లు దాదాపుగా సరిసమానంగా వచ్చే అవకాశం ఉంది. 45 శాతం మంది దళితులు బీజేపీకి, 42 శాతం మంది కాంగ్రెస్ కు ఓటేస్తారు. ముస్లిం సామాజిక వర్గాల్లా మాత్రం కాంగ్రెస్ కు పూర్తి పట్టుంది. 87 శాతం మంది ముస్లింలు ఈ సారి కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపుతున్నారు..