ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదో కోణం. అభ్యర్థులు ఎవరు. వారి సామాజిక, ఆర్థిక స్థితిగుతలేమిటి. వారు మంచి వారా, నేర చరితులా అన్నది మరో కోణం. అదే ఇటీవలి కాలంలో చర్చనీయాంశమైంది…
46 మంది కోటీశ్వరులు
మధ్య భారతంలోని ఆ రాష్ట్రంలో 46 మంది అభ్యర్థులు కోటీశ్వరులని తేలింది. వీరంతా తొలి దశ జరిగే నవంబరు 7న పోలింగ్ లో పోటీ పడుతున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ నిగ్గుతేల్చింది. ఆప్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఖడ్గరాజ్ సింగ్ సంపద రూ. 40 కోట్లు అని తేల్చారు.ఖవార్దా నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆయన రాజకుటుంబం నుంచి వచ్చారు. పండారియా నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి భావనా బోహ్రా సంపద రూ. 33 కోట్లు. జగ్దల్పూర్ నుంచి బరిలోకి దిగుతున్న జతీన్ జైశ్వాల్ ఆస్తి రూ. 16 కోట్లు. సంపన్న అభ్యర్థుల జాబితాలో ఆయనది మూడో స్థానం.
సగటు సంపద రూ.1.34 కోట్లు
తొలి దశ పోలింగ్ లో పోటీ పడే అభ్యర్థుల సగటు సంపద కోటి 34 లక్షల రూపాయలుగా తేల్చారు. బీజేపీ అభ్యర్థుల సగటు సంపద రూ.5.33 కోట్లు అయితే కాంగ్రెస్ కూడా తామేమీ తీసుపోలేదని ప్రకటించింది. ఆ పార్టీ అభ్యర్థుల సగటు సంపద రూ. 5.27 కోట్లు ఉంది. ఆప్ అభ్యర్థుల సగటు సంపద రూ. 4.45 కోట్లు కాగా, జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్ అభ్యర్థుల సగటు సంపద రూ. 30 లక్షల 54 వేల రూపాయలుంది. అతి తక్కువ ఆస్తులున్న వాళ్లు కూడా పోటీ చేస్తున్నారు. దొంగార్ఘర్ రిజర్వ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న హేమ్ కుమార్ సత్నామీ సంపద కేవలం రూ.8 వేలే. చిన్న పార్టీలైన శక్తి చేతనా పార్టీ, రిపబ్లికన్ పక్షకు చెందిన అభ్యర్థుల సంపద రూ. 10 వేలు దాటలేదు. మరో పక్క ఆజాద్ జనతా పార్టీ అభ్యర్థి పర్వాటీ తేట (కంకేర్ -రిజర్వ్), జేసీసీ అభ్యర్థి పూరమ్ నాగేష్ (మోహల్లా మాన్పూర్ – రిజర్వ్ )తమకు పైగా ఆస్తి లేదని అఫిడవిట్ సమర్పించారు.
43 శాతం మంది పట్టభద్రులు
బరిలో ఉన్న వారిలో 52 శాతం మంది ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్నారు. 43 శాతం మంది డిగ్రీ ఆపై చదవులు చదువుకున్నారు. ఒక అభ్యర్థి తాను నిరక్షరాస్యుడినని చెప్పుకుంటే, మరో అభ్యర్థి తన విద్యార్హతలను సూచించలేదు. ఛత్తీస్ గఢ్ తొలి దశలో 25 మంది మహిళా అభ్యర్థులంటే… కాంగ్రెస్ బీజేపీ తరపున చెరి ముగ్గురు బరిలోకి దిగారు.చత్తీస్ గఢ్ లో 90 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 20 చోట్ల తొలి దశ జరిగే నవబరు 7న పోలింగ్ నిర్వహిస్తారు. మిగతా 70 నియోజకవర్గాలకు నవంబరు 17న పోలింగ్ జరుగుతుంది.