పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు పుచ్చుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నట్లేననిపిస్తోంది. ఇటీవలి ఆమె స్టేట్ మెంట్స్ నేరం ఒప్పుకున్నట్లేననిపిస్తోంది. దానితో బీజేపీ కూడా దూకుడు పెంచింది..
ఐటీ చట్టం ఏం చెబుతోంది…
పారిశ్రామికవేత్త దర్శన్ హీరనందానీకి తన మెయిల్ ఐడీతో పాటు పాస్ వర్డ్ కూడా ఇచ్చానని మొయిత్రా ఒప్పుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె ఒప్పుకున్నమాట వాస్తవమే అయినప్పటికీ.. చేసిన తప్పుడు దండన ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చెబుతున్నారు. చట్టాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఆమెకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చని ఆయన తెల్చారు. ఐటీ చట్టం 2000లోని రూల్ 43 ప్రకారం కంప్యూటర్ డేటాలు, సిస్టమ్ పాస్ వర్డ్ ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఈ కేసులో సిస్టమ్ మొత్తానికి యజమానిగా లోక్ సభ స్పీకర్ ను పరిగణించాల్సి ఉంటుంది. ఆయన అనుమతి లేకుండా పాస్ వర్డ్ షేర్ చేసుకున్నందున శిక్షార్హులే అవుతారు. పైగా క్యాష్ ఫర్ క్వశ్చన్ వ్యవహారం ప్రజా జీవితంలో అవినీతి కిందకు వస్తుందని చెప్పేందుకు సందేహించాల్సిన పనిలేదు.
పదవి పూర్తయిన తర్వాత అప్పగించాలి..
నిజానికి ఒక పార్లమెంటు సభ్యుడు తన పదవీకాలం పూర్తయిన తర్వాత డేటాకు సంబంధించిన అంశాలు, పాస్ వర్డ్స్ సంబంధిత అధికారులకు సమర్పించాలి. పైగా పార్లమెంటులో ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలైన మహువా మొయిత్రాకు చట్టం తెలియదంటే ఒప్పుకోలేమని బీజేపీ నేతలు అంటున్నారు. దీనితో పార్లమెంటరీ నైతిక విలువల కమిటీ ముందు మొయిత్రా హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొయిత్రాను అక్టోబరు 31న హాజరు కావాలని కమిటీ ఆదేశించగా ఆమె నవంబరు 5 వరకు గడువు కోరారు. నవంబరు 2న హాజరై తీరాల్సిందేనని కమిటీ తేల్చిచెప్పింది.
బహుమతులు పుచ్చుకున్నది నిజమే…
మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ ను హీరనందానీకి ఇచ్చినట్లు పలు మీడియా ఇంటర్వ్యూల్లో మొయిత్రా వెల్లడించారు. అతని తరపున ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నట్లు కూడా నర్మగర్భంగా అంగీకరించారు. రుమాళ్లు, బ్యూటీ ప్రాడెక్ట్స్ ను హీరనందానీ తనకు పంపేవారని మొయిత్రా చెప్పుకున్నారు. అయితే కొందరు ఆరోపించినట్లుగా డబ్బులు తీసుకోలేదని ఆమె అంటున్నారు. అయితే ఆమె హోటల్ బిల్లును హీరనందానీ చెల్లించిన బిల్లును దుబే మీడియా ముందుంచడంతో మొయిత్రా మరిన్ని చిక్కుల్లో పడినట్లయ్యింది. మొయిత్రా బెంగాల్ అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్నప్పటి నుంచి హీరనందానీతో ఆర్థిక లావాదేవీలు జరిపాలని, 2018లో ఆమె హోటల్ బిల్లును ఆయన చెల్లించని రసీదు దొరికిందని దుబే చెబుతున్నారు. అందుకే ఆమెపై వచ్చిన ఆరోపణలు పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందన్నారు.