కేరళలో వరుస పేలుళ్లు – పాలస్తీన్ లింకుందా ?

కేరళలోని ఎర్నాకుళం ప్రాంతంలో ఆదివారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనల్లో ఒకరు చనిపోగా, 36 మంది గాయపడ్డారు. అందులో పది మంది వరకు పరిస్థితి విషమంగా ఉంది.. ఇదో ఉగ్రవాద చర్యగా భావిస్తున్న అధికారులు రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు..

అసలు ఎక్కడ, ఎలా జరిగింది..

కొచ్చికి దగ్గరగా ఉండే ఎర్నాకుళం కలమాసెర్రీ క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఉదయం మూడు పేలుళ్లు జరిగాయి. యహోవా కన్వెన్షన్ పేరుతో నిర్వహిస్తున్న మత ప్రార్థనల మూడో రోజున ఉదయం 9.40 ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించింది. తర్వాత అరగంట వ్యవధిలోపు మరో రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. క్షతగాత్రులను తక్షణమే వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించగా అందులో ఒక మహిళ అప్పటికే చనిపోయింది. ఆమె శరీర భాగాలు తునాతుకలైపోయాయంటే పేలుడు తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

రంగంలోకి ఎన్ఐఏ బృందాలు

రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు పేలుళ్లపై దర్యాప్తుకు ఎన్ఐఐ బృందాలు రంగంలోకి దిగాయి. అది ఐఈడీ పేలుడైనప్పటికీ తక్కువ తీవ్రత ఉన్న బాంబులుగా గుర్తించారు. పేలుడు జరిగినప్పుడు కన్వెన్షన్ సెంటర్లో 2 వేల మంది క్రైస్తవ భక్తులు ఉండటంతో తొక్కిసలాట వల్ల ఎక్కువ మంది గాయపడి ఉంటారని అనుమానిస్తున్నారు. దుండగులు టిఫిన్ బాక్స్ బాంబు పెట్టారని ఎన్ఐఏ ప్రాథమికంగా నిర్థారణకు వచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం వైపు నుంచి అన్ని సహకారాలు అందిస్తామన్నారు. నిందితులెవ్వరైనా సరే వదిలిపెట్టకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

పాలస్తీనా వివాదంలో కేరళ

పథకం ప్రకారమే పేలుళ్లు సృష్టించారని కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ అభిప్రాయపడ్డారు. పాలస్తీనా పట్ల సానుభూతిగా ఉన్న కేరళ ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ పని చేశారని ఆయన అన్నారు. కేరళ ప్రజలు పాలస్తీనియన్ల పట్ల సానుభూతిగా ఉన్నారని, అందులో ఎవరైనా దుశ్చర్యలను ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని గోవిందన్ హెచ్చరించారు. ప్రస్తుత పేలుడుకు పాలస్తీనా వ్యవహారానికి లింకు పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. శుక్రవారం మల్లపురంలో సాలిడారిటీ యూత్ మూమెంట్ అనే సంస్థ పాలస్తీనా అనుకూల ర్యాలీ నిర్వహించింది. అది జమాతే ఇస్లామీ సంస్థ యువజన విభాగంగా నిర్థారించారు. ఆ ర్యాలీలో ఓ హమన్ నాయుకుడు వర్చువల్ గా ప్రసంగించడంతో వివాదమై కూర్చుంది. హమస్ నాయకుడు వర్చువల్ గా ప్రసంగించడంపై కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ అభ్యంతరం చెప్పిన నేపథ్యంలోనే ఈ పేలుడు సంభవించడంతో ఉగ్రవాద లింకులపై అనుమానాలున్నాయి. ఈ విషయాన్ని వెంటనే నిర్థారించలేకపోయినా, పేలుడుపై పాలస్తీనా లింకు వ్యవహారంలో దర్యాప్తు చేస్తామని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.