ఇంట్లో నిత్యం పాటించాల్సిన విషయాలపై పెద్దలు సూచించిన ప్రతిదాని వెనుకా ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది. తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యను సృష్టిస్తాయి. అందులో ఒకటి మంచంపై కూర్చుని భోజనం చేయడం. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. కానీ ఇలా అస్సలు చేయకూడదని సూచిస్తున్నారు పండితులు…
చాలా మంది అన్నం తినేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. కొంతమంది టీవీ చూస్తూ తింటారు. మరికొందరు ఫోన్ చుస్తూ తింటారు. ఇంకొందరు మంచం పైన కూర్చుని తింటారు. కొందరైతే పిల్లల్ని మంచంపై కూర్చోబెట్టి తినిపించేస్తుంటారు. అలా చేస్తే అన్నం మంచంకోళ్లకు పడుతుందని పెద్దలు అంటుంటారు. అయితే నిజంగా మనం తిన్న అన్నం మంచంకోళ్లకు పడుతుందని కాదు కానీ కడుపునిండదని అర్థం. వాస్తవానికి కింద కూర్చుని భోజనం చేయడం వెనుక సైంటిఫిక్ కారణాలతో పాటూ ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి . ఎందుకంటే మంచం పైన కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారం తీసుకొనే భంగిమ సరిగా ఉండదు నేలపై కూర్చుని తింటే ఆ ఆహారం సరిగా జీర్ణమవుతుంది.
దేహమే దేవాలయం
దేహమే దేవాలయం అని, మన ఆత్మ భగవత్ స్వరూపం అని పురాణాల్లో చెబుతారు. అందుకే దేహానికి శాంతి చేకూరడానికి భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఆహారాన్ని ఐదు వేళ్ళతో తాకినప్పుడు జీవశక్తి ఉత్తేజ పడుతుంది అందుకే చేత్తోనే ఆహారాన్ని తినాలి. ఆహారం తినే ముందు ఆ భగవంతున్ని ప్రార్దించాలి. భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా తినాలి. మంచంపై కూర్చుని తింటే ఈ ఇంట్లో ఉండే వివాహితుల మధ్య వివాదాలు జరుగుతాయంటారు పండితులు. ఇంకా అనారోగ్య సమస్యలు, కుటుంబంలో మనశ్సాంతి లేకపోవడం జరుగుతుందట.అందుకే మంచపై కూర్చుని ఏదీ తినకూడదు, తాగకూడదని చెబుతారు. మంచం అంటే పడుకునే స్థలం కాబట్టి ఆ ప్రదేశంలో తినడం అంటే లక్ష్మీదేవిని అగౌరవపరచడమే.
వాస్తు ప్రకారం రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా షింకులో గిన్నెలు ఉంచకూడదు. అలా కాకుండా.. తిన్న గిన్నెలు అలానే పడేస్తే.. వారు ఇంట్లో డబ్బులు ఎక్కువగా కోల్పోయే ప్రమాదం ఉంది. పడుకునే ముందు పాత్రలను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుంటే.. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.