తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం – మద్దతు బీజేపీకేనా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ స్పష్టత ఇచ్చింది. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు అధినేత చంద్రబాబు సూచించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టు, జైలులో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని ఆ పార్టీ భావించింది.

పోటీ వద్దని కాసానికి చెప్పిన చంద్రబాబు

చంద్రబాబుతో కాసాని ములాఖత్‌‌లో దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు కాసాని కోరగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టిసారించలేదని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే బాధపడాల్సి ఉంటుందని, ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్‌కు సర్దిచెప్పినట్లు తెలిసింది. బరిలో దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూస్తున్నారు కదా అని సర్దిచెప్పినట్టు సమాచారం.

ఏపీలో అధికారంలోకి వస్తే తెలంగాణలో కార్యక్రమాలు

వచ్చే ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి ఫలితం సాధించాలని టీడీపీ లక్,్యంగా పెట్టుకుంది. ఏపీలో మనం విజయం సాధిస్తే తర్వాత తెలంగాణలో కూడా పార్టీకి తేలిగ్గా బలం పుంజుకుంటుంది. ఆషామాషీగా పోటీ చేసి సరైన ఫలితం రాలేదని బాధపడే బదులు దూరంగా ఉండటమే మంచిది. మనం సర్వసన్నద్ధంగా ఉండి పోరాడితే మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు చెప్పారు. ముందు ఏపీలో అధికారంలోకి తీసుకు రావాలని .. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని అనుకున్నారు.

టీడీపీ మద్దతు బీజేపీకేనా ?

పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు… టిక్కెట్లు ఆశించిన వారు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. వారికి అవకాశం ఉన్న చోట పోటీకి బీజేపీ చాన్స్ ఇవ్వనున్నారని అంటున్నారు. అందుకే టీడీపీ మద్దతుదారులంతా బీజేపీకి ఏకపక్షంగా ఓటింగ్ చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.